తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించింది.
రేవంత్ రెడ్డి కేవలం ఒక “డెలివరీ బాయ్” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదై, అరెస్టుకు దారితీసింది.
గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాము తెలంగాణ పోలీసులమంటూ వచ్చిన అధికారులు ఈ అరెస్ట్ ప్రక్రియను చేపట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస సమాచారం లేకుండా నేరుగా వచ్చి అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరెస్ట్ అనంతరం పోలీసులు నాగార్జున యాదవ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. నాగార్జున యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
