నటి ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఐశ్వర్య రాజేశ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. వినోదం, కుటుంబ భావోద్వేగాలు, పల్లెటూరి రాజకీయం కలగలిసిన చక్కటి ఎంటర్టైనర్ అని ఆమె పేర్కొన్నారు.
ఈ చిత్రం ఒకే జానర్‌కు పరిమితం కాదని, అత్యంత వినోదాత్మకంగా ఉంటుందని ఐశ్వర్య తెలిపారు. తాను ఇందులో ‘దామిని’ అనే పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తిరువీర్ పోషించిన ‘తిరు’ పాత్ర కార్పొరేటర్ కావాలని ఆశపడుతుందని, ఆస్తి కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న విచిత్రమైన నిబంధనలకు తన పాత్రకు ఉన్న సంబంధం ఏమిటనేది సినిమాలోని ప్రధానాంశమని వివరించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తనకు ఒక నటిగా ఇంటింటి గుర్తింపును తెచ్చిపెట్టిందని, ప్రేక్షకులు తనను సొంత మనిషిలా చూస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సినిమాలు, ఓటీటీ అన్న తేడా లేకుండా అన్ని వేదికలపై నటిస్తానని, ముఖ్యంగా తమిళంలో చేసిన ‘సుడల్’ సిరీస్ తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆమె స్పష్టం చేశారు.
పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలమే ఉంటుందన్న భయంతో, ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 50 సినిమాలు పూర్తి చేశానని ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో నీలాంబరి వంటి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు, అలాగే ‘అబ్సెషన్’ తరహా పాత్రలు చేయాలని ఉందని తన ఆసక్తిని పంచుకున్నారు.
