ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో సర్ గడువును ఎన్నికల కమిషన్ ఈ నెల 24 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజుతో గడువు ముగియనుండగా, కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
సీఈవో అభ్యర్థనతో కొత్త షెడ్యూల్‌ను సవరించి విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ 24 వరకు గడువు పొడిగించింది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. అలాగే జూలై 31 నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చింది. సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్) ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
కాగా, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈరోజు(జులై 14) ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల(4,16,27,694) మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4.14 కోట్ల(4,14,86,830) మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 12.29 లక్షల(12,29,224) ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని అధికారిక సమాచారం. ఇప్పుడు పది రోజుల గడువు పొడిగింపు తో పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొవాలని ఓటర్లను కోరుతున్నారు.
