Saturday, May 4, 2024
- Advertisement -

డిసెంబ‌ర్ చివ‌రినాటికి ఈవీఎంలను సిద్ధం చేసే ప‌నిలో ఈసీఈసీ..

- Advertisement -

ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయా ? అవును వచ్చేస్తున్నాయి. అనే సమాధానం వినిపిస్తోంది. 2017 మే నెలలో 13.95 లక్షల ఈవీఎంలను, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్ లను, 16.15 లక్షల వీవీ పాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) లను సమకూర్చవలసిందిగా కోరుతూ ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్), ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు ఆర్డర్ ఇచ్చింది. ఈవీఎంలు సెప్టెంబర్ నెలాఖరుకి డెలివరీ అవడానికి సిద్ధం అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు సహా 31 రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 24 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని ఇప్పటికే ఈసీ లా కమిషన్ కు వెల్లడించింది. ఈవీఎంల జీవితకాలం 15 ఏళ్లు అని అంచనా వేసింది. ఒక్కసారి వాటిని తయారు చేస్తే వచ్చే జమిలి ఎన్నికలతో పాటు 2034 జమిలి ఎన్నికల వరకూ వినియోగించవచ్చని తెలిపింది. వీటి తయారీ ఖర్చు కూడా తక్కువే కనుక, జమిలి ఎన్నికల ఖర్చు తగ్గించినట్లు అవుతుందని భావిస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ 2017 లోనే 14 లక్షల ఈవీఎంల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. దీంతో ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలు దేశవ్యాప్తంగా వెళ్తున్నాయి. వచ్చే డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరి లేదా ఫిబ్ర‌వ‌రిలో ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అదే కోరుకుంటున్నారు. ఆయన కోరినట్లే కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు అంగీకారం తెలుపుతున్నాయి. ఇంకొన్ని విభేదిస్తున్నాయి.

అయితే ముందస్తు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి ? అనే ప్రశ్న సహజంగా వినిపించేదే. బయటకు మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెరవెనుక తన ప్రయత్నాలు ముమ్మరం చేసేశారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం, ముందస్తుకు వెళ్లం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర పెత్తనాన్ని అంగీకరించం…మా ప్రభుత్వానికి పూర్తిగా ఐదేళ్లు పాలించే హక్కు ప్రజలు ఇచ్చారు. కనుక చివరి వరకూ అధికారంలో ఉంటాం. ముందస్తుపై అవసరమైతే కోర్టుకెళ్తాం.. అని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేస్తున్నారు. ఏ క్షణం ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్ ను అప్రమత్తం చేసేశారు. పార్టీకి చెందిన అన్నిస్థాయిల లీడర్లు గ్రౌండ్ లెవల్లో పని చేయాలని, ఏ చిన్న అవకాశాన్నివదులుకోకూడదని దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా టికెట్ ఆశించే అభ్యర్ధులతో మంతనాలు జరిపేస్తున్నారు. టికెట్ ఎవరికి కన్ ఫామ్ అయినా, మిగతావాళ్లు నిరుత్సాహపడకుండా గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలని, అందరి బాగోగులు నేను చూసుకుంటా అంటూ చంద్రబాబు ఎన్నికలకు దాదాపు సిద్ధమైపోయారు. అన్ని అస్తశస్త్రాలను రెడీ చేస్తున్నారు.

ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఏ క్షణం ఎన్నికలు వచ్చినా రెఢీ అంటున్నారు. ముందస్తు వచ్చినా, ఏప్రిల్, మేలలో వచ్చినా ఎప్పుడైనా సై అంటున్నారు. పాదయాత్రలో ఆయన ఇప్పటికే ఎన్నికల హామీలు, వాగ్ధానాలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం హామీలు ఇచ్చి మరిచిపోయిందని, తమ ప్రభుత్వం వస్తే అలా జరగదని చెబుతున్నారు. ఏపీలోని దాదాపు 10 జిల్లాల్లో ఆయన పాదయాత్ర పూర్తి కావస్తోంది. ఇక మిగిలింది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రమే. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ ప్రభుత్వా వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రత్యేకహోదా ప్రధాన అస్త్రంగా ఆయన దూసుకెళ్తున్నారు. తమ పార్టీ మ్యానిఫెస్టో టీడీపీ మాదిరిగా పెద్ద పుస్తకంలా ఉండదని చెబుతున్నారు. రెండు, మూడు పేజీల్లో అందరికీ అర్దమయ్యేలా, అన్నివర్గాలకూ న్యాయం జరిగేలా తయారు చేస్తామంటున్నారు. ఆ మ్యానిఫెస్టో కూడా తన పాదయాత్ర తర్వాత, ప్రజలు సూచించినట్లే తయారు చేస్తామని, ప్రజలే వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టో రూపకర్తలని జగన్ ప్రసంగాల్లో చెబుతున్నారు. అంటే ఒకరంగా జగన్ ఇప్పటికే ఎన్నికల సమర శంఖం పూరించేసినట్లే. ఆయన సభలకూ జనం భారీగా తరలివస్తుండంటో, ఆయన రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు.

ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా డేటా సేకరించిన ఆయన పలుచోట్ల అభ్యర్ధలు ఖరారు కూడా అంతర్గతంగా చేసినట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు ఉన్నా వారిని పార్టీ కేడర్ గా మార్చుకోవడంలో పవన్ ఇంకా వెనకబడే ఉన్నారు. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్నా, మంచి ఇమేజ్ ఉండే నాయకులను తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనా చేస్తున్నారు. మున్ముందు మరింత ఎక్కువ సమయం ప్రజల్లో ఉండి పార్డీ జెండా, అజెండా జోరుగా తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో పవన్ బిజీగా ఉన్నారు. ఇక యూపీఏ మళ్లీ అధికారం చేపడితే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేకహోదా పైనే అని సోనియా, రాహుల్ చెబుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సారికి అధికారం దక్కించుకోలేకపోయినా, కొన్ని సీట్లయినా గెలవాలనే పట్టుదలతో ఏపీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి హోదా విషయంలో అన్యాయం చేయడంతో ఏపీ బీజేపీలో మేకపోతు గాంభీర్యమే కనిపిస్తోంది. హోదాపై మోసం చేశామన్న అపఖ్యాతి మోడీతో పాటు బీజేపీ నాయకులంతా మూటగట్టుకున్నారు. దీంతో ప్రజల్లోకి వెళ్లాలంటేనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏపీలోని అన్ని పార్టీలూ సిద్ధంగానే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -