- Advertisement -

రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు..కేంద్రం తాజా నిర్ణయం

- Advertisement -

పాలిమర్ కరెన్సీ నోట్లు త్వరలో భారతదేశంలో చలామణిలోకి రానున్నాయి. క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం రూ.10, రూ.20 డినామినేషన్లలో 10 కోట్ల పాలిమర్ కరెన్సీ నోట్లను జారీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా ఇది మొదటి ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతేనే, వాటిని భారీస్థాయిలో జారీ చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

పాలిమర్ నోట్లు బలంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని ఆర్‌బిఐ భావిస్తోంది. అవి అంత సులభంగా చిరగవు, అలాగే నీరు, మురికి పట్టవు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పాలిమర్ నోట్లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. సాంప్రదాయ నోట్ల కంటే వీటి మన్నిక ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కాగితపు కరెన్సీని నిలిపివేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ నోట్లు కూడా చలామణిలో కొనసాగుతాయి. దీని అర్థం ప్రజలు తమ వద్ద ఉన్న కాగితపు కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం ఆర్‌బీఐకి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో 2009 సెప్టెంబర్‌లో కోచి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ ప్రయత్నించింది. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రయోగం పూర్తిస్థాయికి చేరుకోలేదు. ఈసారి మాత్రం అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ ఎత్తున గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50కి పైగా దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ, డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ.. సామాన్యుడి చేతిలో నిత్యం నలిగే చిన్న నోట్లను సురక్షితంగా, ఎక్కువ కాలం మన్నేలా చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -