Saturday, May 18, 2024
- Advertisement -

ముగిసిన…ద్ర‌విడ‌ ఉద్య‌మ సూరీడు క‌రుణానిధి శ‌కం

- Advertisement -

కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఆయన మరణించినట్టు కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.తమిళనాడు రాజకీయ దిగ్గజం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ‘కలైంజర్’ కరుణానిధి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. బీపీ డౌన్ అవ్వడంతో చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. 11 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు.. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించాయి. కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ చతురుడు. తనకంటే ప్రజాకర్షణకలిగిన ఎంజీఆర్‌ ప్రభంజనంలో సైతం ఆయన తట్టుకొని నిలిచారు. కాలానికి ఎదురీదారు. అనేక అపజయాలను చవిచూశారు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తమిళనాడు పగ్గాలు అందుకున్నారు. ద్రవిడ సంస్కృతి పరిరక్షణకు అహరహం శ్రమించిన నిత్యహాలికుడు కరుణానిధి.

1924 జూన్‌ 3న తమిళనాడులోని తిరుక్కువాలైలో ఆయన జన్మించారు. బాల్యంలో ఆయన పేరు దక్షిణామూర్తి. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు. బాల్యంలోనే నాటికల రచన, సాహిత్యంపై మొగ్గుచూపించేవారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా ఆయన పని చేశారు. తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలులాంటివెన్నో రాశారు. తమిళ లిటరేచర్ కు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.

1924లో బ్రిటీష్ వారి పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తమిళ నాయీబ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. స్కూలు రోజుల్లోనే డ్రామా, పొయెట్రీ, రచనపై ఆయన ఆసక్తి చూపించారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడైన కరుణ… తన 14వ ఏట సాంఘిక పోరాటాల వైపు అడుగులు వేశారు.

14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు.అప్పట్లో జస్టిస్‌పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ‘ఆల్‌స్టూడెంట్‌క్లబ్‌’ అనే సంస్థను నెలకొల్పాడు. ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం కావడం గమనార్హం. కల్లుకుడిలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం తమిళ సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ప్రారంభించారు.

1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 33 ఏళ్ల వయస్సులో ఆయన తొలిసారిగా ఎన్నికయ్యారు. ద్రవిడ మున్నేట్ర కళగం స్థాపనలో కీలక భూమిక వహించారు. 1961లో డీఎంకే ట్రెజరర్ గా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఓటమి అన్నది చవిచూడలేదు.

1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సినీనటుడు ఎంజీ రామచంద్రన్‌ పార్టీ నుంచి వెళ్లిపోయి అన్నాడీఎంకే పేరుతో కొత్త రాజకీయపక్షాన్ని నెలకొల్పారు. అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో సుదీర్ఘకాలం ఆయన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎంజీఆర్‌ మరణాంతరం జరిగిన ఎన్నికల్లో డీఎంకే మళ్లీ ఘనవిజయం సాధించడంతో సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

తమిళ రాజకీయాల్లో ఉద్వేగాలు ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆయన వ్యూహాలు రచించేవారు. ఒక సారి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా హవాను ఆయన ముందే ఊహించారు. వెంటనే చిరకాల మిత్రపక్షం కాంగ్రెస్‌ను వదిలి భాజపాతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అనంతరం భాజపాకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందించారు. పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా పసిగట్టలేని పరిస్థితులను ఆయన ముందుగానే గుర్తించేవారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. 2009లో తమిళటైగర్లపై శ్రీలంక సైన్యం చేపట్టిన సైనికచర్యను నిరసిస్తూ నిరాహారదీక్షకు దిగడం సంచలనం సృష్టించింది.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలో డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు.

కరుణ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలం:

1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు
1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు
1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు
1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు
2006 మే 13 నుంచి 2011 మే 15 వరకు

కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. తంజావూర్ యూనివర్శిటీ ఆయనను ‘రాజ రాజన్’ అనే బిరుదుతో సత్కరించింది. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వం కరుణను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కరుణానిధి సాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడు అంటూ కరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ వారసుడిగా కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు. దీనిపై ఆయన ఇంకో కుమారుడు అళగిరి వ్యతిరేకత వ్యక్తంచేసినా కరుణ వెనకడుగు వేయలేదు. దేశంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. దాదాపు 60 ఏళ్ల పాటు ద్రవిడ రాజకీయాల్లో వెలుగు వెలిగిన కరుణానిధి లేరంటే నమ్మశక్యం కావడం లేదు. క‌రుణ మ‌ర‌ణంతో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

క‌రుణానిధికి ముగ్గురు భార్య‌లు. పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ లను కరుణ వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు భార్యలతో ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి జన్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -