Monday, May 20, 2024
- Advertisement -

మరో తుని ఘటనకు పిలుపునిచ్చావా పవన్ ?

- Advertisement -

ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన పార్టీ నిర్వహించబోతున్న కవాతు గురించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయం గొలిపేవిగా ఉన్నాయి. ఆ కవాతుతో దేశమంతా మనవైపు చూడాలి. దేశమంతా దీనిపై మాట్లాడుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తూనే దేశమంతా మాట్లాడాలి. అందుకోసం మీరేం చేస్తారో చేయండి. నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయాల్లోకి ఓ ఆవేదన, కోపం కసి బాధతో వచ్చాను. ప్రజా సమస్యలపై పోరాడటానికే వచ్చానన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు బాగా బలమున్న ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా. అలాంటి చోట పట్టు సాధించలేకపోతే ఆ తప్పు ఆ ప్రాంత నాయకులదే అవుతుంది. అందుకే ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజ్ పై చేపట్టబోతున్న కవాతుపై దేశమంతా మాట్లాడాలి. అందుకు ఏం చేస్తారో చేయండి. నేనున్నాను. అంటూ పవన్ చెప్పిన మాటలు అనేక అనుమానాలకు భయాలకు తావిస్తోంది.

ఓ మాములు కవాతు గురించి దేశమంతా ఎందుకు మాట్లాడాలి ? సాధారణ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు, నిత్యం దేశమంతటా ఏదో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. ప్రతి పట్టణాల్లో, నగరాల్లో అవి కామనే. వాటి గురించి స్థానికులకు కూడా పెద్దగా తెలియదు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని ఆందోళనకారులు విరమిస్తారు. తమ డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని కోరుతుంటారు. వాళ్ల నుంచి స్పష్టమైన హామీ ఇస్తే విరమిస్తుంటారు. ఇది నిత్యం జరిగేదే. కానీ పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు, కార్యకర్తలకు, ఆయన అభిమానులకు పిలుపునిచ్చినట్టు దేశమంతా ఆ కవాతు గురించి మాట్లాడాలంటే ఏదో పెద్ద ఘటన జరిగితే కానీ దేశమంతా మాట్లాడరు. ఊహించని రీతిలో, అనుకోని అతి భయంకరమైన సంఘటనలు జరిగితే తప్ప దేశమంతా మాట్లాడదు. ఓ సాధారణ కవాతు గురించి దేశమంతా మాట్లాడాలంటే, ఆ కవాతు సందర్భంగా ఏవైనా దుర్ఘటనలో, అవాంఛనీయ ఘటనలో జరగాలి. గతంలో తునిలో కాపుల ఉద్యమం సందర్భంగా రైళ్లు తగల బెట్టేసి, పోలీస్ స్టేషన్లకు, వాహనాలకు నిప్పు పెట్టేసి దేశమంతా ఉలిక్కి పడేలా చేసిన ఘటనను ఇంకా ప్రజలు మరిచిపోలేదు. ఆ ఘటనపై దేశమంతా మాట్లాడింది. ఇప్పుడు మళ్లీ తుని ఘటనను గుర్తు చేసేలా మరో ఘటనకు గానీ సిద్ధమయ్యారా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదైనా చేయండి నేనున్నాను అని అన్నారంటే…దాని అర్ధమేంటని సామాన్యులు భయపడతున్నారు. మరి పవన్ పిలుపులో అర్ధమేంటో తెలియాలంటే ఈ నెల 15వరకూ ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -