రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 87 శాతం పనులు పూర్తయ్యాయని వైసీపీ వెల్లడించింది. “అసలు పనులే ప్రారంభం కాలేదు” అన్న ఆరోపణలను ఖండిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలతో పాటు ఫొటోలు, వీడియో ఆధారాలను కూడా విడుదల చేసింది.
వైసీపీ బృందం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 800 అడుగుల లెవెల్ నుంచి రోజుకు 6 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా 100 అడుగుల లోతు, 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానల్ పనులు పూర్తయ్యాయని పేర్కొంది. అంతేకాదు, 12 సొరంగాలు (టన్నెల్స్) నిర్మాణం దాదాపుగా ముగిసిందని, అలాగే 300 మీటర్ల దూరంలో ఉన్న పంప్ హౌస్ నిర్మాణం కూడా తుది దశకు చేరిందని వివరించింది.
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా భారీగా నీటిని తరలిస్తున్న పరిస్థితుల్లో, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రారంభించారని వైసీపీ నేతలు గుర్తుచేశారు. ఇది పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతాంగానికి గణనీయమైన లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం నిజాలను వక్రీకరిస్తోందని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపించింది. వాస్తవాలను ప్రజలు గమనించాలని, ఇప్పటికే పూర్తైన పనులను కొనసాగించి రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
