- Advertisement -

కోడలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన అత్తామామలు

- Advertisement -

కోడలిని కాపాడాలని తపించిన అత్తామామల ప్రయత్నం విషాదాంతమైంది. విద్యుత్ షాక్‌కు గురైన కోడలిని రక్షించే క్రమంలో అత్తామామలిద్దరూ అదే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగణం రాజుపాలెం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.

చాగణం రాజుపాలెం గ్రామానికి చెందిన ఇండ్ల రవి (57), సునీత (50) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వంశీకి కొద్ది నెలల క్రితం చెంచమ్మతో వివాహమైంది. శనివారం ఉదయం చెంచమ్మ ఇంటి వరండాలో దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ఇనుప తీగకు విద్యుత్ సరఫరా అయి షాక్‌కు గురైంది. ఆమె అరుపులు విని పరుగున వచ్చిన అత్తామామలు సునీత, రవి వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఇనుప తీగను పట్టుకోవడంతో విద్యుత్ ప్రవాహం వారిని కూడా తాకింది. ఫలితంగా అత్తామామలిద్దరూ అక్కడికక్కడే విగతజీవులయ్యారు.

ఈ ప్రమాదంలో కోడలు చెంచమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉంటున్న కుటుంబంలో ఒకేసారి ఇద్దరు పెద్దలు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాయకష్టంతో కుటుంబాన్ని సాకుకుంటూ, పిల్లలకు పెళ్లిళ్లు చేసి బాధ్యతల నుంచి విముక్తి పొందిన సమయంలో విధి వారిని ఇలా బలి తీసుకోవడం స్థానికులను తీవ్ర కలచివేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -