Sunday, May 19, 2024
- Advertisement -

రోశయ్యను తప్పించేసే టైమొచ్చిందా?!

- Advertisement -

కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే భారతీయ జనతా పార్టీ వాళ్లు చేసిన మొదటి పని.. గవర్నర్ల పదవుల్లో తమవారిని కూర్చోబెట్టడం.

అప్పటి వరకూ చాలా మంది కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల గవర్నర్ల హోదాలో ఉండే వారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన షీలా దీక్షిత్.. ఏపీ ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం అడిగినప్పుడు రాజీనామా చేసి పెట్టిన రోశయ్య వంటి వాళ్లతో సహా.. అనేకమంది కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల గవర్నర్ల హోదాల్లో ఉండేవారు. ఎలాగూ అధికారం పోతుందని ఫిక్సయ్యిందో ఏమో కానీ.. కాంగ్రెస్ అధిష్టానం తమ పాలనాకాలం చివరిలో అనేక మంది రాష్ట్రాలకు గవర్నర్లుగా తమ పార్టీ నేతలను నియమించి వెళ్లింది.

అయితే అధికారం చేతికి అందగానే.. బీజేపీ వాళ్లు గవర్నర్ల పని పట్టారు. కేంద్ర హోం శాఖ గవర్నర్ల రాజీనామాలను అడిగి తీసుకొంది. తమ హయాంలో గవర్నర్ల వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని విమర్శిస్తూనే.. కాంగ్రెస్ వాళ్లందరినీ తప్పించి తమ పార్టీ సీనియర్ నేతను, కురువృద్ధులను గవర్నర్లుగా నియమించారు కమలనాథులు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ సర్కారు లెక్క చేయలేదు. తమ పని తాము చేసుకొంటూ వెళ్లిపోయారు. తమ వారికి గవర్నర్ల పదవులతో ఉపాధిని కల్పించారు.

అలా తొలి రౌండ్ లో కొంతమందిని గవర్నర్ల పదవుల నుంచి తప్పించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు రెండో రౌండ్ కు సన్నద్ధం అవుతోందని సమాచారం. ఇంకా దేశంలో కొన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ నియమిత గవర్నర్లు ఉన్నారు. తొలి రౌండ్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లను ఖాళీ చేయించిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోని.. వేరే ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న  రాష్ట్రాల్లోని గవర్నర్లను తప్పించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అతి త్వరలో మొత్తం 11 రాష్ట్రాల గవర్నర్లను తప్పించనునట్టు సమాచారం. వీరిలో తమిళనాడు గవర్నర్ గా ఉన్న రోశయ్య కూడా ఒకరని తెలుస్తోంది. రోశయ్యతో బీజేపీకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోయినా.. కాంగ్రెస్ వాడు కాబట్టి.. ఆయనను తప్పించేసి.. ఆ స్థానంలో తమ వారిని నియమించుకోవాలని భావిస్తున్నారట. అలాగే ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ పై కూడా ఇప్పుడు వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -