Saturday, May 18, 2024
- Advertisement -

జనసేన కాపుల కోసమేనా ?

- Advertisement -

తనకు కుల మతాల పట్టింపు లేదని పదే పదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ వాస్తవానికి జనసేనలో కులానికే పెద్ద పీట వేస్తున్నాడు. కొత్తతరానికి కొత్తరాజకీయం అవసరమని చెప్పుకుంటూ…అనుభవజ్ఞుల పేరుతో పాతకాపులకే ప్రాధాన్యమిస్తున్నాడు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో ఇప్పటికే రహస్య చర్చలు జరుపుతూ 20 మందికి ఆహ్వానాలు అందజేసిన పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఆ తానులోని ముక్కే అని తేల్చేశాడు. యువతకు 60 శాతం, సీనియర్లకు 40 శాతం పేరుతో ఇతర పార్టీల నేతలకు గాలమేస్తున్నాడు. అందులోనూ కాపులే ఎక్కువగా ఉండటం విశేషం. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ మధ్య జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నవారిలో అధికశాతం మంది కాపులే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో యువరాజ్యం అధ్యక్షుడిగా వెలగబెట్టిన పవన్ కళ్యాణ్ ఆ హోదాలో చేసిందేమీలేదనుకోండి. కానీ నాడు అన్నయ్య చేర్చుకున్నట్లే నేడు తమ్ముడు కూడా సొంత సామాజికవర్గం నాయకులను అక్కున చేర్చుకుంటున్నాడు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర సామాజికవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుటుంటోంది. జనసేనకు కాపు నాయకులు ఉంటే చాలా ? రేపు ఓట్లు కూడా ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్లే వేస్తే చాలా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా 90 శాతం కాపుల హడావుడే కనిపిస్తోందని. ఆయా కార్యక్రమాలను చూస్తుంటే ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమమా ? లేక కాపు సామాజిక వర్గం వనభోజన కార్యక్రమమా ? అనే అనుమానాలు కూడా కలిగి అటువైపే వెళ్లడం మానుకుంటున్నామని ఇతర సామాజిక వర్గం వారు తమదైన గోదారి యాసలో ఎటకారమాడుతున్నారు.

ఏపీలోని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలవైపు ఆశగా చూస్తున్న జనసేనాని, ఆయా పార్టీల్లోని మొదటి ప్రాధాన్యత కాపులకే ఇస్తున్నారు. అందుకే ఆయన పార్టీలో చేరుతున్నవారిలో, జనసేన వేదికల మీదా అత్యధికశాతం కాపులే కనిపిస్తున్నారు. కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణను స్వయంగా పవనే ఆహ్వానించి జనలో చేర్చుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ కార్పొరేటర్ శేషుకుమారి, కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బల్లబ్బాయిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు, అలియాస్ నానాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగిశెట్టి అశోక్ జనసేనలో చేరారు. ఇక తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తన అనుచరులతో త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు ప్రధాన పార్టీలకు చెందిన మరికొందరు కాపు నేతలు కూడా పవన్ ఆహ్వానం మేరకు రానున్న రోజుల్లో జనసేనలో చేరబోతున్నారు. అయితే ఆయన పార్టీ, ఆయన సామాజికవర్గం కనుక, అభిమానంతో అధ్యక్షుడు చేర్చుకున్నా, అనుచరులు చేరుతున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, ఓ రాజకీయ పార్టీగా అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తే, జనసేన మనుగడకే ప్రమాదం ఉండదు. లేదంటే…ఇలాంటి తప్పులు చేసే ప్రజారాజ్యం ఆఖరికి అడ్రస్ లేకుండా పోయింది. భవిష్యత్ లో జనసేన కూడా అదే రీతిన ఇబ్బందులు కొనితెచ్చుకునే ప్రమాదముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -