Saturday, May 18, 2024
- Advertisement -

ఓటమి భయంతోనే 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ

- Advertisement -

జననేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. తన కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న తన అన్న చిరంజీవికి పట్టిన దుస్థితి తనకు పట్టేటట్టు ఉందని ఆయన భయపడుతున్నారు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం తరఫున 2009లో తన అత్తగారి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుతో పాటు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తిరుపతిలో గెలిచారు. కానీ పాలకొల్లులో కాంగ్రెస్ మహిళా అభ్యర్ధి ఉషారాణి చేతిలో ఘోరపరాజయం పొందారు. సొంత జిల్లాలో అత్తగారి ఊరిలో ఆయనకు మరిచిపోలేని పరాభవాన్ని ఆ ఎన్నికలు మిగిల్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఆ అనుభవాలు, భయాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకూ జనసేన పోటీ చేస్తుంది కానీ, అధికారం ఆశించడం లేదు. ప్రశ్నించడానికే పార్టీ తప్ప పాలించడానికి కాదు…అని స్టేట్ మెంట్లు ఇచ్చిన పవన్ స్వరం బీజేపీ తెరవెనుక సపోర్టుతో మారిపోయింది.

నేనూ సీఎం అవుతా, నేనూ పాలిస్తా..అంటూ ఈ మధ్య ఊహల పల్లకిలో పవన్ ఊరేగుతున్నారు. అధికారం తుచ్ఛం, నీచం అని స్పీచులిచ్చిన పవన్ ఇప్పుడు అధికారదాహంతో అలమటిస్తున్నారు. 2017 నవంబరు 10న అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లా కరువుకాటకాలతో అల్లాడిపోతోంది. పస్తులతో జనం వలసలు పోతున్నారు. వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు. నేను ఎమ్మెల్యే అయితే ఈ పరిస్థితిని మారుస్తాను. ఆకలికేకలు లేని అనంత జిల్లాను సాధిస్తాను. అని ఉపన్యాసమిచ్చారు. అందుకే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. గెలిచినా ఓడినా నేను బరిలో దిగేది అనంతపురం జిల్లా నుంచే అని అనంత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. పవన్ కు తమ జిల్లా మీద ఉన్న ప్రేమాభిమానాలకు ఆ జిల్లా వాసులు పొంగిపోయారు. ఎలాగైనా గెలిపించాలని అభిమానులు కసరత్తు ప్రారంభించారు.

ఇంతలో ఈ మధ్య శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడా సమస్యలు ఉన్నాయి. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి నేను శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను. అని చెప్పారు. దీంతో ఆ జిల్లాలోని ఆయన అభిమానులు సంతోషించారు. అదే సమయంలో ఆయన స్టేట్ మెంట్ విన్న అనంత జిల్లా అభిమానులు పవన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా జిల్లా మీద, మా మీద నమ్మకం లేదా ? మేం గెలిపించుకోలేమా ? అందుకే శ్రీకాకుళం జిల్లాలో పోటీకి సిద్ధమయ్యారా ? అని జనసేన కారకర్తలు, పవన్ అనంత జిల్లా అభిమానులు మండిపడుతున్నారు. ఒకే చోట నుంచి పోటీ చేసి ఓటమి పాలైతే పార్టీ అధ్యక్షుడిగా పరువు పోవడంతో పాటు, పార్టీలో, రాజకీయాల్లో భవిష్యత్ శూన్యం అని పవన్ కి అన్నయ్య చిరంజీవితో పాటు పలువురు రాజకీయ ఉద్ధండులు, మోడీ కనుసన్నల్లో పనిచేసే బీజేపీ మిత్రులు సలహాలిచ్చారు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయి, ఓ పది పదిహేను సీట్లు వచ్చినా, ఆ పార్టీలో పవన్ కి స్థానముండదని, పార్టీని గెలిచిన వారు హస్తగతం చేసుకుని, పవన్ ను సాగనంపేస్తారని విశ్లేషకులు, రాజకీయ అనుభవజ్ఞులు హెచ్చరించారు. దీంతో ఎన్నికల తర్వాత అధికారం దక్కించుకోవడం సంగతి సరే, ముందు పార్టీ బతికించుకుంటే చాలు, ఆ పార్టీలో తనకు స్థానముంటే చాలు… అని పవన్ రెండు చోట్ల పోటీకి దిగుతానని ప్రకటించారు. ఒకచోట ఓడిపోతే మరోచోటైనా గెలుస్తాం కదా…అనే పవన్ స్ట్రాటజీ మంచిదే కానీ, ఆయన ప్రకటన, పోటీ పవన్ మీద అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేసింది. మరి పవన్ రెండు చోట్లా గెలుస్తాడా ? రెండు చోట్లా ఓడిపోతాడా ? లేదా అన్నలాగానే ఒకచోట ఓడి, మరోచోట గెలుస్తాడా ? అన్నది ప్రస్తుతానికి చెప్పడం కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -