Thursday, May 16, 2024
- Advertisement -

నీ అంతు చూస్తానంటూ తహశీల్దార్ పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే…ముదురుతున్న వివాదం

- Advertisement -

నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రెవెన్యూ అధికారులపై నోరు పారేసుకున్నారు. రాస్కేల్..నువ్వెంత ? నీ బతుకెంత ? నీ సంగతి తేల్చేస్తా ? ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్ ? ప్రొటోకాల్ అంటే లెక్కలేదా ? ఎమ్మెల్యే అంటే ఎవరనుకుంటున్నావ్ ? అంతు చూసేస్తా…అంటూ రామారావు రెచ్చిపోయారు. ఆవేశంతో ఊగిపోయారు. నువ్వు నాకు చెప్పినంతవాడివైపోయావా ? నీ సంగతి చూస్తా..అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. రన్ వే నుంచి అరైవల్ ఎంట్రన్స్ ద్వారా వారు ఎయిర్ పోర్ట్ బయటకు వస్తారని అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాలని వేచి చూశారు. వారితో పాటు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వేచి ఉన్నారు. కానీ వీరికి తెలియకుండా మెయిన్ గేట్ నుంచి మాజీ ప్రధాని, కర్నాటక సీఎం బయటకు వచ్చేశారు. దీంతో అరైవల్ గేటు వద్ద వేచి చూస్తున్న ఎమ్మెల్యే రామారావుని తీసుకురావడానికి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడు వెళ్లారు. సార్.. పొరపాటు జరిగింది. ఇలా వస్తారనుకుంటే, వాళ్లు మెయిన్ గేట్ ద్వారా బయటకు వచ్చేశారు. అక్కడికి వెళ్లి స్వాగతం పలుకుదాం రండి. అని ఎమ్మెల్యేను పిలిచారు. దీంతో బొల్లినేని రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. రాస్కెల్…నువ్వెంత ? నీ ఉద్యోగం ఎంత ? ప్రొటోకాల్ గురించి నీకు తెలియదా ? నాకు చెప్పేవాడివైపోయావా ? మీకు ప్రొటోకాల్ తెలుసుకదా ? వాళ్లు ఎలా వస్తారో తెలిసి, కూడా కావాలనే నన్ను వేరే గేట్ వద్ద అనవసరంగా కూర్చోబెట్టారు..అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ సంగతి చూస్తా..అంటూ తహశీల్దార్ సహా జాయింట్ కలెక్టర్ పై ఆయన చిందులు తొక్కారు. దీంతో అక్కడున్న మిగతా అధికారులంతా అవాక్కయ్యారు.

ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అకారణంగా, అన్యాయంగా, అహంకారపూరితంగా దుర్భాషలాడారని, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, చిత్తూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్‌వో సంఘనేత చెంగల్రాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అలా నోరు పారేసుకోవడం ఏం పద్ధతని నిలదీశారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ప్రజాప్రతినిధులు మాట్లాడితే తాము ఎలా విధులు నిర్వహించాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ గిరీష, తహసీల్దార్‌ నరసింహులునాయుడుకు ఎమ్మెల్యే రామారావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే విధులు బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు అంతా ఉద్యమిస్తామని, ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదులు, పరస్పర కేసులు టీడీపీ పరువుని బజారుకీడ్చాయి. రెవెన్యూ ఉద్యోగులు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేలుగా మారిపోయిన ఆ గొడవ పెద్ద దుమారమే రేపింది. ఆ ఘటనలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబే జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి పార్టీ పెద్దలు ఎలాగోలా ఆ గొడవ సద్దుమణిగేలా చేసి, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలను శాంతిపజేశారు. ఆ ఘటనపై ఇప్పటికీ టీడీపీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చింతమనేని ఘటన మర్చిపోకముందే బొల్లినేని రచ్చ మొదలైంది. మరి ఈ గొడవ ఎన్ని మలుపులు తిరుగుతుందో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -