Wednesday, May 15, 2024
- Advertisement -

అందరి కన్నూ సీఎం సీటుపైనే, ఆశతో అసలుకే ఎసరు

- Advertisement -

అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ లో అది ఇంకాస్త ఎక్కువై అసలుకే ఎసరు పెడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై చాలావరకూ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో ఉద్యమం చేపట్టి, విజయం సాధించిన కేసీఆర్ ఫ్యామిలీ ఆ తర్వాత నినాదాన్ని మార్చేసిందనే ఆరోపణలున్నాయి. నియామకాలు కేసీఆర్ ఇంటిలోనే జరిగాయని, తద్వారా నిధులు వారింటికే వెళ్తున్నాయని, ఇక నీళ్లు మాత్రం కన్నీళ్లు రూపంలో ప్రజలకు వస్తున్నాయని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటింటీకీ నల్లా…ఇలా అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, పైగా అర్ధంపర్ధం లేని జీవోలు, నిర్ణయాలతో కోర్టులతో మొట్టికాయలు తినడం అలవాటైపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన, నిరుద్యోగులు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్ లు వస్తే అధికార పార్టీకి బుద్ధి చెబుతామంటున్నారు.

అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతికేరకత ఉంది. ఆ వ్యతిరేకతను మరింత రాజేసి, ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాల్సిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరికివారే యుమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుండటం, ద్వితీయశ్రేణి నాయకులు పెద్దగా పాపులర్ కాకపోవడంతో కేసీఆర్ పని ఈజీ అవుతోంది. దానం నాగేందర్ వంటి వారు ఎవరైనా స్థానికంగా బలపడతారు, రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారు. అని అనిపిస్తే…వెంటనే కేసీఆర్ వారిని గులాబీ గూటికి లాగేస్తున్నారు. మరోవైపు 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను సీఎం, అంటే నేను సీఎం అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరికివారే పావులు కదుపుతున్నారు. పేరుకు అందరూ ఒకే మాట మీద ఉంటున్నట్టు కనిపిస్తున్నా, తెరవెనుక ఎవరి లాబీయింగుల్లో వారు మునిగిపోయారు. పార్టీ హై కమాండ్ ను ప్రసన్నం చేసుకుని, స్పష్టమైన హామీ వస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని భావిస్తున్నారు. లేదంటే ఉన్నామంటే ఉన్నామనే తీరుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నెట్టుకొస్తున్నారు. జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క్, రేవంత్ రెడ్డి, దామోదర రాజనరసింహా, గీతారెడ్డి, ఇలా అందరూ ఊహల పల్లకీలో ఊరేగితున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు పాదయాత్ర చేస్తాం, అనుమతివ్వండి అంటూ ఏఐసీసీ వద్ద విన్నవించుకున్నారు. ఎవరికి వారే పాదయాత్ర చేస్తామంటున్నారు తప్ప, అంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామనకపోవడంపై అధిష్టానం ఆలోచనలో పడింది. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ బస్సు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బస్సు యాత్ర అయితే నేతలందరూ ఒకే చోట ఉంటారని, ఐక్యంగా ఉండటం వల్ల పార్టీ లాభపడుతుందని భావించింది. తెలంగాణ వ్యాప్తంగా 117 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని ఆదేశించింది. ధూం ధాంలతో పాలకులకు చెమటలు పట్టించాలని చెప్పి పంపింది.

కానీ అధిష్టానం ఆలోచన విఫలమైంది. దాదాపు 60 లక్షల రూపాయలపైనే ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బస్సు ప్రస్తుతం గాంధీ భవన్ గేటు దాటి బయటకు రావట్లేదు. హడావుడిగా 34 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశాం. అని మమ అనిపించారు. తర్వాత వర్షాలు పడుతున్నాని, ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు పనుల్లో మునిగిపోయారని, ఇప్పుడు యాత్ర సరికాదని చెప్పుకొస్తున్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, ఓ వైపు, ఇతర నేతలు మరోవైపు గ్రూపు రాజకీయాలతో వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని, వచ్చే డిసెంబర్ 3 నుంచి 8వ తేదీ లోపు నోటిఫికేషన్ రావచ్చని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేతలంతా ఒక్కటై, ఉన్న అస్త్రాలన్నీ ఎక్కుపెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. అప్పుడే గట్టిపోటీ ఇవ్వగలరు. లేదంటే మరోసారి ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు. ఈ సారి ప్రతిపక్షంలో కూర్చుంటే ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీని ఖాళీ చేసేసినట్లు, వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ను కూడా కేసీఆర్ ఖాళీ చేసేస్తారు. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్లకు తెలియనది కాదు. కాకపోతే అందరూ పల్లకీ ఎక్కుదామని ఆశపడుతున్నారు. కానీ మోసేవారే లేక చతికిల పడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -