Saturday, May 18, 2024
- Advertisement -

ట్రూ పొలిటికల్ కమెడియన్ పవన్…. కవిత అలా… బాలయ్య ఇలా… బాబు మరోలా…

- Advertisement -

యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్ గుర్తుందా? కాంగ్రెస్ నాయకుల పంచెలూడగొట్టండి అంటూ పవన్ చేసిన సంచలన స్టేట్‌మెంట్స్ పవన్‌కి హీరోయిక్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. షబ్బీర్ అలీ దేశ ద్రోహి అంటూ మాట్లాడిన మాటలు పవన్‌ని హీరోని చేశాయి. చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అని ప్రజా రాజ్యం నేతలు, కార్యకర్తలు కూడా ఫీలయ్యారు. కట్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ సిద్ధాంతాలుగా అమ్ముడు…. కొనుడు…. అమ్ముడుపోవుడు లాంటి చిల్లర బేరాలతో చిరంజీవి రాజకీయం చేసి తన స్వార్థం కోసం మొత్తానికే దుకాణం తీసుకెళ్ళి సోనియా మార్కెట్‌లో అమ్మేశాడు. ఆ తర్వాత 2014ఎన్నికల సమయంలో చంద్రబాబుకు, మోడీకి సపోర్ట్ చేసిన వ్యవహారం ఎలా ఉన్నా ఆ తర్వాత నుంచీ మాత్రం పవన్ వ్యవహారాలు రోజు రోజుకూ ఆయనను కమెడియన్‌ని చేస్తున్నాయి.

ప్రజల తరపున ప్రశ్నిస్తా అని 2014లో డప్పాలు కొట్టిన పవన్…. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చంద్రబాబు, మోడీలను కూడా నిలదీస్తా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన పవన్……. ఎన్నికలయ్యాక మాత్రం పూర్తిగా కామెడీ వేషాలు వేస్తున్నాడు. తెలంగాణాలో కెసీఆర్‌ని పొగుడుతూ తెలంగాణాలో రాజకీయాలు చేద్దామనుకున్నాడు. తన స్వార్థ ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుతో ప్యాకేజ్ ఒప్పందాలు, ఆర్థిక ప్రయోజన విషయాల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ తనను తాను ఇంతలా దిగజార్చుకుని అధికార పార్టీలకు సాయం చేస్తున్నప్పటికీ అధికార పార్టీలు మాత్రం పవన్‌ని మరీ కూరలో కరివేపాకులా కూడా ట్రీట్ చేయకపోవడంతో పవన్ అభిమానులు కూడా ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

తన స్థాయి తగ్గించుకుని మరీ కల్వకుంట్ల కుటుంబంతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు పవన్. కెసీఆర్‌ని బ్రహ్మాండంగా పొగిడేశాడు. కెటీఆర్‌ని కూడా పొగిడాడు. పార్లమెంట్‌లో జై ఆంధ్రా అన్నదన్న కారణం దొరకడంతో కవితను కూడా పొగిడేశాడు. కానీ ఆ ముగ్గురూ మాత్రం కనీస స్థాయిలో కూడా పవన్‌ని పట్టించుకోలేదు. పవన్ గురించి ఒక్క ప్రశంశ కూడా ఇవ్వలేదు. ట్విట్టర్‌లో తమను ట్యాగ్ చేస్తూ పొగిడిన ఇతర సెలబ్రిటీస్‌కి కనీసం థ్యాంక్స్ చెప్పడం సెలబ్రిటీస్ అందరూ ఫాలో అయ్యే ఒక నియమం. అయితే కవిత మాత్రం పని గట్టుకుని మరీ తనను పొగిడిన పవన్‌ని కనీసం కేర్ చేయలేదు. అస్సలు స్పందించలేదు.

ఇక టిడిపి అగ్ర కుటుంబ సభ్యుడు, ఎమ్యెల్యే బాలకృష్ణ అయితే పవన్‌ని ఒక ఆట ఆడుకున్నాడు. పవన్ గురించి స్పందించమంటే…….పవన్ కళ్యాణా? ఎవడు వాడు? వాడెవడో నాకు తెలియదు? అనే రేంజ్‌లో ఘాటుగా మాట్లాడేశాడు బాలకృష్ణ. అజ్ఙాతవాసి డిజాస్టర్ అవ్వడానికి బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు టిడిపి వర్గం అంతా కూడా అజ్ఙాతవాసిపై దుర్మార్గపు ప్రచారం చేశారన్న ఆవేదన పవన్ ఫ్యాన్స్‌లో ఉంది. ఇప్పుడు బాలయ్య మాటలు ఇంకాస్త మంటెత్తిపోయేలా చేస్తాయనడంలో సందేహం లేదు. 2014లో టిడిపిని గెలిపించిన పవన్ కళ్యాణ్‌ని ….ఎవడు వాడు? వాడెవడో నాకు తెలియదు అని బాలయ్య మాట్లాడడం మాత్రం పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయమే.

ఇక ఫైనల్‌గా చంద్రబాబు కూడా పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గాలితీసేసే మాటలు మాట్లాడేశాడు. ప్రజల కోసం పోరాడుతున్నానన్న బిల్డప్ ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో పవన్ కళ్యాణ్ ఏదో హంగామా చేస్తుంటే తాజాగా టిడిపి అంతర్గత సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు…….‘పవన్ కళ్యాణ్ ఏం చేసినా మనకోసమే. అవసరమైన సమయంలో మనకు అండగా ఉండడం కోసమే’ అని కుండబద్దలు కొట్టేశాడు బాబు. ఈ వీడియో మీడియాకు లీక్ కావడంతో పవన్ రాజకీయ డ్రామా బెలూన్ అడ్డంగా పేలిపోయింది. మొత్తానికి సినిమా తెరపై హీరోయిజం పండించిన పవన్ కళ్యాణ్…..పొలిటికల్ తెరపై మాత్రం చిరంజీవికంటే ఇంకా వేగంగా ట్రూ కమెడియన్ అనిపించుకుంటున్నాడు. అలాగే చిరంజీవి కంటే పెద్ద పొలిటికల్ కమెడియన్‌ని అని కూడా నిరూపించుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -