Monday, May 20, 2024
- Advertisement -

మీడియాకు.. కేసీఆర్ ఫీవర్!

- Advertisement -

మీడియా… ప్రజల సమస్యలను.. ప్రజలు తెలుసుకోలేని వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి.. వాటికి పరిష్కారాలు ఇవ్వగలిగే సాధనం. మీడియా.. కొన్ని రోజులుగా తెలుగు మీడియాను చూస్తుంటే.. స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ విపరీత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఏ ఒక్క వార్త కూడా బలంగా ప్రసారం చేయలేనంతగా.. ప్రచురించలేనంతగా.. మీడియా బలహీనపడిన విషయం స్పష్టంగా తేలిపోతోంది.

విభజన సమయంలో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కార్యక్రమంలో.. ఓ రోజు వివాదాస్పద కామెంట్లు చేశారు. అప్పటి నుంచి తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. ఏబీఎన్ ప్రసారమవుతోంది. టీవీ 9కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే.. జై తెలంగాణ పేరుతో కొత్తగా చానల్ ప్రారంభించి.. తెలంగాణ వాయిస్ ను టీవీ9 యాజమాన్యం ఎత్తుకోవడంతో.. విషయం మరుగునపడింది.

ఈ విషయమే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పినా.. ఎవరు మాట్లాడినా.. ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం దక్కడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మీడియా సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం నియంత్రిస్తోందన్న అభిప్రాయం కలిగేలా.. పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే.. ప్రభుత్వ పరంగా కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు బాగానే ఉంటున్నాయి. ప్రజలకు వీలైనంత మేలు చేసేలా సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. ఇదే సమయంలో.. మీడియాను నియంత్రించేలా కూడా ప్రయత్నాలు జరగడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

ప్రభుత్వం ఏం చేసినా.. ఆఖరికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినా.. హైప్ ఇచ్చేలా వార్తలు ప్రచురించడం, కథనాలు ప్రసారం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న విషయాలకే విపరీతంగా కవరేజ్ ఇవ్వడం లాంటి సందర్భాలు ఉండడం కూడా సరికాదని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితుల విషయంపై.. కాంగ్రెస్ నాయకులు కాస్త గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు.

మార్కెట్ విలువ ప్రకారం.. భూముల విలువలు మార్చి.. భూసేకరణ చట్టాన్ని సవరించాకే.. రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై.. మీడియా కవరేజ్ ఇస్తున్నా… ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగా.. ప్రశ్నించినట్టుగా ఎక్కడా లేకపోవడమే.. చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడంటే..వర్షాలు కురుస్తున్నాయి. కానీ.. ఇన్నాళ్లూ గ్రామాల్లో రైతులు చనిపోతుంటే.. ఉపాధి లేక ఉన్న ఊళ్లు వదిలి వలస పోతుంటే.. ఏ మీడియా కూడా హైలైట్ చేయలేకపోయింది.

గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయంపై.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయలేకపోయింది. ప్రతిపక్షం బలహీనపడుతున్న పరిస్థితుల్లో.. అపోజిషన్ పాత్ర పోషించాల్సిన మీడియా.. ఆ దిశగా వర్కవుట్ చేయలేకపోయింది.

మీడియాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వరకూ కంట్రోల్ చేస్తుందన్నదీ పక్కన పెడితే.. స్వంతంగా మీడియానే తనకు తాను డిఫెన్స్ లో పడుతున్న పరిస్థితి.. ఈ పరిణామాలతో కనిపిస్తోంది. అందుకే.. ఇప్పటికైనా.. పరిస్థితిలో మార్పు రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -