Saturday, May 18, 2024
- Advertisement -

చిరు, బాలయ్య…… ఇతర స్టార్ హీరోలకు… తమిళ స్టార్ హీరోలను చూసినా బుద్ధిరాదా?

- Advertisement -

అబ్బో …..అందరూ సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళే. మీడియా ముందు సోది కబుర్లు అన్నీ చెప్తారు. గంజీ తెలుసు…..బెంజీ తెలుసు అని పంచ్ డైలాగులు పేల్చుతారు. ఇక అభిమానులే మా ప్రాణం…..అభిమానుల కోసం ఏమైనా చేస్తాం అని ఎదవ కబుర్లు అన్నీ చెప్తారు. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అద్దాల గాలి మేడలు దాటి అడుగువేయరు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించే తీరిక ఉండదు. అధికారంలో ఉన్నవాళ్ళకు ఎక్కడ కోపం వస్తుందో…….ట్యాక్స్‌లు ఎగ్గొట్టి, రియల్ ఎస్టేట్ దందాలతో సంపాదించిన డబ్బుల వెనకాల ఉన్న బొక్కలు బయటికి తీస్తారో అని భయం. పైకి మాత్రం అభిమానులు మా ఇంటి సభ్యులు అనే స్థాయిలో కబుర్లు చెప్తూ ఉంటారు.

ఇప్పుడు ఆ యువ అభిమానులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం చిప్ప చూపించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. భవిష్యత్‌పై బెంగతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్డెక్కారు. మరి ఎక్కడ మన సినీ తారలు……అభిమానులు ఓట్లేస్తే ఎమ్మెల్యే పదవి, కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ పదవులను అప్పనంగా అనుభవిస్తున్న చిరంజీవి ఎక్కడ? ఇప్పుడు ఆయనగారు రాజ్యసభ సభ్యుడేగా? కనీసం స్పందించాలన్న విజ్ఙత లేదా? తెలుగు పౌరుషం, తోటకూర, గోంగూర అంటూ మాట్లాడే ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడ? ఇక ఇతర సూపర్ స్టార్స్, యువ స్టార్స్ అందరూ ఏం చేస్తున్నారు? కేవలం జల్లికట్టు అనే సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం రజినీకాంత్ నుంచి చిన్న స్థాయి హీరోల వరకూ అందరూ ప్రత్యక్ష పోరాటానికి దిగారే…….మరి మన స్టారాదిస్టారులు, వీరాధివీరులు ఎక్కడ? రాజకీయాల్లో చించేస్తా అని చెప్పుకునే పవర్ స్టార్ కూడా ఫాం హౌస్ దాటి బయటకు రాడే?

మన స్టార్ హీరోల ఒరిజినల్ బండారాలు ఇవే. అభిమానులే మా బలం, అభిమానులే మా కుటుంబం అని సినిమా రైటర్స్ రాసిచ్చిన నాలుగు డైలాగులు చెప్పగానే ఆ మాటలన్నీ నిజమే అనుకుని చొక్కాలు చించుకుంటూ, వాళ్ళ కోసం కొట్లాడుకుంటూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ…….తెరవెనుక ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీ పెట్టగానే గుడ్డిగా ఓట్లు కుమ్మరిస్తూ ఉండే అభిమానులు ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటే ఈ స్టార్ హీరోల ఆటలు ఇకపైన అయినా కంట్రోల్‌లో ఉంటాయి. లేకపోతే మాత్రం మూఢాభిమానుల జీవితాలు అడుక్కునే స్థాయికి, అథమ స్థాయికి దిగజారుతూనే ఉంటాయి……ఈ మూఢాభిమానులే అభిమానమే పెట్టుబడిగా కోటాను కోట్లు సంపాదించుకునే స్టార్స్ మాత్రం చలిమర గదులలో, ఫాం హౌస్‌లలో, విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మోసం చేసేవాడిని నిందిస్తూ బ్రతకడం కంటే కూడా కాస్త తెలివితెచ్చుకుని మోసం చేసేవాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉంటే కాస్తైనా మార్పు ఉంటుంది. లేకపోతే మాత్రం మాటల్లో అభిమానం చూపిస్తూ……చేతల్లో మాత్రం ఆ అభిమానమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొడుతూ మోసం చేసేవాళ్ళు ఆకాశహర్మ్యాల దిశగా ఎదుగుతూనే ఉంటారు. మూఢాభిమానులు మాత్రం అథోగతి దిశగా పతనమవుతూనే ఉంటారు. కోటీశ్వరుల ఫోర్బ్స్ జాబితాలో స్టార్లు……బికారుల లిస్టులో అభిమానులు మిగిలిపోతూనే ఉంటారు. కంటికి కనిపిస్తున్న నిజాలను కూడా తెలుసుకోలేని జాతిని ఎవరు మాత్రం ఏం కాపాడగలరు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -