Sunday, May 19, 2024
- Advertisement -

కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించిన మేరీ కోమ్..

- Advertisement -

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది. ఒలింపిక్ చాంపియన్ మేరీ కోమ్‌కు 45-48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ దక్కింది. కామ‌న్ వెల్త్ ఆట‌ల్లో ఆమెకు మొద‌టి ప‌సిడి ఇదే. మొదటిసారి కామన్‌వెల్త్ గేమ్స్ ఆడుతున్న 35 ఏళ్ల మేరీ కోమ్.. టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ఫామ్‌ను కనబరిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్లో ఐర్లాండ్‌కు చెందిన ప్రత్యర్థి క్రిస్టినా ఓ హరాను 5-0 తేడాతో ఓడించి స్వ‌ర్ణం సాధించింది. ఇప్పుడు కామన్వెల్త్‌లో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందించిన మహిళగా రికార్డులకెక్కింది.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఉత్తర ఐర్లండ్‌కు చెందిన క్రిస్టినా ఓహరను పదునైన పంచ్‌లతో చిత్తుచేసి భారత్‌కు స్వర్ణం అందించింది. 45-48 కేజీల విభాగంలో జరిగిన ఈ బౌట్‌లో 30-27, 30-27, 29-28, 30-27, 20-27తో తిరుగులేని విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.

మణిపూర్‌కు చెందిన 35 ఏళ్ల మేరీ కోమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. పాల్గొన్న తొలిసారే స్వర్ణం కొల్లగొట్టడం విశేషం. ఈ పోటీల్లో భారత్ శనివారం ఉదయానికి 18 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి మొత్తం 43 పతకాలతో మూడో స్థానంలో ఉంది.

అయిదు నెలల క్రితం ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మేరీ.. అదే దూకుడును ఇక్కడా ప్రదర్శించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ బౌట్‌లో చెలరేగిన తీరు అందర్నీ ఆకట్టుకున్నది. మేరీ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ గోల్డ్ మెడల్ చేరింది. ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ మేరీ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు అయిదుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిళ్లు మేరీ ఖాతాలో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -