Saturday, May 18, 2024
- Advertisement -

కోహ్లీని సెలెక్ట్ చేసినందుకే నా ప‌ద‌వి ఊడింది….వెంగ్ స‌ర్కార్‌..

- Advertisement -

బీసీసీఐ జాతీయ ఎంపిక కమిటీ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2008లో శ్రీలంక టూర్‌కు తమిళనాడు బ్యాట్స్‌మన్ బద్రీనాథ్‌ని కాదని టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని సిఫారసు చేసినందుకు తన పదవి ఊడిందని ఆయన వ్యాఖ్యానించారు.

2008లో జరిగిన జూనియర్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న భారత అండర్-19 జట్టుకు సారథ్యం వహించిన కోహ్లీకి అదే ఏడాదిలో జరిగిన శ్రీలంక టూర్‌లో పాల్గొనే టీమిండియాలో చోటు కల్పించాలని తాను సిఫారసు చేశానని ఆయన అన్నారు. ఇది అప్పటి బీసీసీఐ కోశాధికారి శ్రీనివాసన్‌కు నచ్చలేదని అందుకే తన పదవీకాలం మధ్యలోనే ముగిసిపోయిందని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు.

శ్రీలంక టూర్‌కు టెస్ట్, వన్డే జట్ల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ సమావేశమయిందని, అప్పుడు వన్డేల్లో కోహ్లీకి స్థానం కల్పించాలని తాను సిఫారసు చేశానని, కానీ అప్పటి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ లకు అది నచ్చలేదని వెంగీ అన్నారు. సెలక్షన్ కమిటీలోని నలుగురు సభ్యులు మాత్రం తన మాటను గౌరవించినా ధోనీ, కిర్‌స్టెన్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ బద్రీనాథ్‌వైపే మొగ్గుచూపారని ఆయన ఆరోపించారు. చివరికి బద్రీనాథ్‌కి జట్టులో స్థానం కల్పించనందుకు అప్పటి బోర్డు కోశాధికారి ఎన్.శ్రీనివాసన్ మనస్తాపం చెందారని వెంగీ చెప్పుకొచ్చారు.

2008, ఆగస్టు 18న శ్రీలంకపై తొలి వన్డేలో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడిన విరాట్ కోహ్లి (12: 22 బంతుల్లో 1×4) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొత్తంగా ఐదు వన్డేల ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లి వరుసగా 12, 37, 25, 54, 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. 2011 ప్రపంచకప్.. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా నాలుగు అసాధారణ శతకాలు బాదడంతో కోహ్లి పేరు మార్మోగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -