మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడం ఇప్పుడు సీఎం జగన్ ముందున్న టార్గెట్ ఇదే. వైనాట్ 175తో ముందుకెళ్తున్న జగన్…ప్రతిపక్ష కూటమికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. ఇక త్వరలో బస్సుయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలిసే ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే పాలనలో తనదైన మార్క్ స్పష్టంగా చూపించిన జగన్…సంక్షేమ పథకాలనే తిరిగి వైసీపీకి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కట్టబెడతాయనే ధీమాలో ఉన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు దగ్గరైన జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో కులాల వారీగా లెక్క చేపట్టే కుల గణనను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
దేశంలో బిహార్లో బీసీ కులగణన చేపట్టి విజయం సాధించగా తాజాగా జగన్ ఒక అడుగు ముందుకేసి కులాల వారీగా ఉన్ జనాభా ఎంత అనే దానిపై లెక్క తీయనున్నారు. ఒక సర్వేను అధికారికంగా మరో సర్వేను అనధికారికంగా చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు జగన్.
నవంబరు 15 నుంచి ఈ కుల గణన ప్రక్రియ ప్రారంభం కానునట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కుల గణనలోనే ఏ పార్టీకి, ఏ నాయకుడికి అనుకూలమో,ఎమ్మెల్యేపై వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై త్వరలోనే అఫిషియల్ ప్రకటన రానుండగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
