ఈవీఎంలతో ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2029లో జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయనని ప్రకటించారు.
గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈవీఎంలలో అక్రమాలు , ట్యాంపరింగ్ చేసి గెలిచారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలపై తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే బ్యాలెట్ పేపర్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేసినా ఫలితం ఉండదనన్నారు. 2024లో మోసం చేసినట్లే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని…బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు.
ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక విధానంలో నాయకులు ఎన్నిక అవుతారని వ్యాఖ్యానించారు.
