టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించాయి సూపర్ సిక్స్ హామీలు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయలేకపోవడాన్నిఇంకా సమర్థించుంకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళ టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంలోకి రాకముందు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయగలనని అనుకున్నానని కానీ అధికారంలోకి వచ్చాక సాధ్యం కాదన్న విషయం అర్థమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూశాక సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం చాలా కష్టమైన పని అనిపిస్తోందని చెప్పేశారు.
ఈ పథకాలను అమలు చేయడానికి మరిన్ని రుణాలు తీసుకుంటే, దీర్ఘకాలంలో ప్రభుత్వం వాటిని కొనసాగించలేకపోతుందని తేల్చిచెప్పేశారు. ఇక ఎన్నికలకు ముందు ఉచిత RTC బస్సు ప్రయాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందిస్తామని చెప్పినా, ఇప్పుడు దీనిని జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20,000 ఇస్తామని చెప్పినా, ప్రస్తుతం రూ. 14,000 మాత్రమే ఇస్తామని వెల్లడించారు. ఇక చంద్రబాబు తొలుత రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పగా,ఇప్పుడు రూ.9.75 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ఈ మొత్తాన్ని రూ.10 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో మాట్లాడుతూ, 2025 మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు సుమారు రూ.5.62 లక్షల కోట్లుగా ఉందని వెల్లడించారు.
కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు..
()నిరుద్యోగ భృతి రూ.3,000
()యువతకు 20 లక్షల ఉద్యోగాలు
()అర్హులైన వారికి సంవత్సరానికి మూడు ఉచిత LPG సిలిండర్లు
()పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి రూ.15,000
()రైతులకు రూ.20,000
()18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
()మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణం
