ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన ‘ఒజెంపిక్’ (Ozempic) ఇంజెక్షన్ ఇప్పుడు భారత మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ ఈ కీలక ఔషధాన్ని భారత్‌లో విడుదల చేసింది. ప్రధానంగా టైప్–2 మధుమేహం నియంత్రణ కోసం అనుమతి పొందిన ఈ డ్రగ్, బరువు తగ్గించే లక్షణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ను సంపాదించింది.
ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) అనేది వారానికి ఒక్కసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది శరీరంలో ఆకలిని తగ్గించి, గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. భారత్‌లో ఈ ఔషధం 0.25 mg, 0.5 mg, 1 mg డోసుల్లో లభ్యమవుతోంది. వినియోగదారులు సులభంగా, నొప్పి లేకుండా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా ‘నోవోఫైన్ నీడిల్స్’తో కూడిన ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు.
ధరల విషయానికి వస్తే, ప్రారంభ డోసు అయిన 0.25 mg పెన్ ధర రూ. 8,800గా నిర్ణయించారు. అలాగే 0.5 mg పెన్ రూ. 10,170, 1 mg పెన్ రూ. 11,175గా ఉంది. ఒక్కో పెన్లో నాలుగు వారాలకు సరిపడే డోసులు ఉంటాయి. అంటే నెలకు ఒక పెన్ సరిపోతుంది.
ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ,
“ఒజెంపిక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టడం మా సంస్థకు ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్‌గా నిరూపితమైన ఫలితాలు కలిగిన ఈ ఔషధం, భారతీయ వైద్యులకు ఒక ప్రభావవంతమైన చికిత్సా ఎంపికను అందిస్తుంది. సులభంగా ఉపయోగించగల పెన్ ద్వారా మెరుగైన రక్తంలో చక్కెర నియంత్రణతో పాటు బరువు నియంత్రణ, గుండె మరియు కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఒజెంపిక్ ఒక కీలకమైన చికిత్సా పరిష్కారంగా మారనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
