టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగు శాఖకు చెందిన ఎస్సీ అధికారిపై దాడి చేసిన ఘటనపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ అధికారులపై దాడి చేసే స్థాయికి ఎలా దిగజారుతారు? అధికారులు మీకు బానిసలు కాదు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన అధికారులను బెదిరించడం, దాడి చేయడం అసహనకరమని స్పష్టం చేశారు.
వెలుగు ఆఫీసర్‌పై టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేశారన్న విషయం తన దృష్టికి వచ్చిందని కొలికపూడి తెలిపారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసేవలో ఉన్న అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, 48 గంటల్లో ఆ అధికారికి టీడీపీ అధ్యక్షుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కొలికపూడి డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఉద్యమాలు, న్యాయపరమైన చర్యలు తప్పవని సూచించారు. చట్టానికి మించి ఎవరూ కాదని, అధికారులను బెదిరించే వారెవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టమైన హెచ్చరిక చేశారు.
అధికారులు ధైర్యంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ఎస్సీ అధికారుల గౌరవం, భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని కొలికపూడి పేర్కొన్నారు.
