తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దివంగత వైఎస్సార్సీపీ కార్యకర్త మందా సాల్మన్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం (ప్రవీణ్), కుమార్తె రాహేలు, అలాగే పిన్నెల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇటీవల టీడీపీ గూండాల చేతిలో రాజకీయ కక్షతోనే తమ తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని సాల్మన్ కుమారులు, కుమార్తె వైయస్ జగన్కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం పూర్తిగా దిక్కులేని పరిస్థితిలోకి వెళ్లిందని, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు, వారి అండతో పోలీసులు తమను ఎలా బెదిరింపులకు గురిచేస్తున్నారో, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరును కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వివరించారు.
వారి వేదనను శ్రద్ధగా విన్న వైయస్ జగన్ పార్టీ క్యాడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అక్రమ కేసులు, వేధింపుల విషయంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో న్యాయసహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవస్ధలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బాధిత కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.
