జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. రాజ్యసభలో కేంద్రమంత్రి నిత్యానంద్‌రాయ్ వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టారు. వందేమాతర గీతాన్ని అవమానిస్తే జైలుశిక్ష పడేలా చట్టం తీసుకు వచ్చేలా నిర్ణయించారు. అందులో భాగంగా ఈ బిల్లు ప్రతిపాదించారు. కాగా ఈ బిల్లుపై విపక్షాల అభ్యంతరం, ఆందోళన చేడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
కేంద్రం కొద్ది రోజులుగా చెబుతున్న విధంగా వందేమాతరం పై పార్లమెంట్ లో కీలక బిల్లును ప్రతిపాదించింది. నీట్ ప్రకంపనలు… మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో నిరసన లు హోరెత్తుతున్న వేళ కేంద్రం ఈ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించింది. వందేమాతరం గేయం ఆలాపనను కావాలని అడ్డుకున్నా, గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఇబ్బందులు కలిగించినా నేరంగా పరిగణించేలా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ 1971 చట్టానికి కేంద్రం తాజా బిల్లులో మార్పులు ప్రతిపాదించింది. అయితే, విపక్షాలు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛాహక్కుకు భంగం కలిగించేలా బిల్లులో నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్లుపై అభ్యంతరం చెబుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ కేంద్రానికి లేఖ రాశారు. బిల్లును వెనక్కు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయం స్థాయిలకు సంబంధించి ప్రస్తుమున్న రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బిల్లు ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం పాత్ర మరువ లేనిదని అన్నారు. అయితే, ఈ బిల్లుతో దేశభక్తి, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా.. బీజేపీ మాత్రం ఈ బిల్లును గట్టిగా సమర్థించింది. జాతీయ గేయమైన వందేమాతరంలో ఒకప్పుడు కొన్ని చరణాలను మాత్రమే ఆలపించేవారని, ఇప్పుడు పూర్తిస్థాయిలో పాడుతున్నారని చెబుతున్నారు.
