పంచదార్ల పుణ్యక్షేత్రంలో సాగుతున్న అక్రమ మైనింగ్ పరిసరాలను తక్షణమే ఖాళీ చేయాలని శాసన మండలి విపక్ష నేత బొత్సా సత్యానారాయణ అల్టిమేటం జారీ చేసారు. అంతే కాకుండా 24 గంటల్లోగా యంత్రాలు, పరికరాలను తరలించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. లేకుంటే ఇదే పంచదార్ల క్షేత్రంలో మళ్లీ తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
పంచదార్ల పుణ్యక్షేత్రంలో అక్రమ మైనింగ్ కు నిరసనగా వైసీపీ ఆందోళన చేపట్టింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్రమ మైనింగ్ సాగించిన బాధ్యలపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని బొత్సా సత్యనారాయణ డిమాండ్ చేసారు. మైనింగ్ ను పూర్తిగా నిలిపివేసినట్లు, బాధ్యులపై తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం ప్రకటించే వరకు పంచదార్లలో వైసీపీ ప్రజా పోరాటం ఆగబోదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. స్థానికంగా ఉన్న పలువురు భక్తులు వైసీపీ నేతలను కలసి మైనింగ్ తవ్వకాల వలన జరుగుతున్న నష్టాలను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
సనాతన ధర్మం పేరుతో మాట్లాడే ప్రభుత్వం, ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భంలో ఎందుకు మౌనంగా ఉంటోందో, అక్రమార్కులకు ఎందుకు కొమ్ము కాస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్సా డిమాండ్ చేసారు. పంచదార్లలోని ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం నిర్వహణ విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తుంటే, వెంటనే సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు. ధర్మాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి మౌనంగా ఉంటే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని, రాజకీయ లాభనష్టాల కంటే ధర్మం ముఖ్యమనే అంశాన్ని వైసీపీ విశ్వసిస్తోందని స్పష్టం చేసారు. దేవాలయాల పవిత్రతను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవాలయాలను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగవని బొత్స హెచ్చరించారు.
