నెల్లూరు జిల్లాలో అత్యంత హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. క్యాన్సర్ లేదా ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం, ఏకంగా తన ప్రాణాలనే త్యాగం చేసిందో కూతురు. తన మరణం తర్వాత వచ్చే డెత్ ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రికి వైద్యం చేయించాలంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం (ANM)గా సాయి చందన ప్రియ (27) విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే, సచివాలయంలో ఎవరూ లేని సమయంలో ఆమె తీవ్ర మనస్తాపంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతురాలి వద్ద లభించిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యూరమయ్యారు. ఆ లేఖలో చందన ప్రియ పేర్కొన్న విషయాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ‘‘అమ్మా.. నన్ను క్షమించు. నా పేరు మీద రూ. 60 లక్షల డెత్ ఇన్సూరెన్స్ ఉంది. నేను పాము కాటు లేదా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి. నా ఇన్సూరెన్స్ డబ్బులతో నాన్నకు మంచి ట్రీట్‌మెంట్ చేయించండి. అక్క.. అమ్మ, నాన్నలను నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకో.’’ అంటూ ఎంతో ఆవేదనగా రాసుకొచ్చింది.
సందన ప్రియ తండ్రి రమణయ్య గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలో తండ్రి వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో, కూతురు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన చావు ద్వారా వచ్చే బీమా మొత్తంతో తండ్రిని బతికించుకోవచ్చని ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
