పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో మమతా బెనర్జీ స్వయంగా కోర్టు ముందు హాజరై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె న్యాయ బృందం ద్వారా మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మమతా.ఎన్నికల సంఘాన్ని “ఎన్నికల సంఘం కాదు… వాట్సాప్ కమిషన్” అని వ్యాఖ్యానించారు.
ప్రజల పేర్లను యథేచ్ఛగా ఓటరు జాబితాల నుంచి తొలగిస్తున్నారు. బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియ సాగుతోంది అని ఆమె కోర్టుకు తెలిపారు.
మమతా బెనర్జీ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 10లోపు తమ సమాధానాన్ని దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా, SIR ప్రక్రియ కోసం డిప్యుటేషన్‌కు అందుబాటులో ఉన్న క్లాస్–2 అధికారుల జాబితాను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది. బెంగాల్‌పై అన్యాయంగా చర్యలు తీసుకుంటున్నారని మమతా బెనర్జీ మరోసారి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్నికల సంఘం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం SIR ప్రక్రియకు సహకరించడం లేదని తెలిపింది. క్లాస్–3 ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందిని మాత్రమే నియమించడంతో డాక్యుమెంట్ల పరిశీలనకు సరైన అధికారం లేదని పేర్కొంది. అందుకే మైక్రో ఆబ్జర్వర్లను నియమించాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం వివరించింది.సాలిసిటర్ జనరల్ కూడా ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలు శత్రుత్వ భావంతో చేస్తున్నవని వ్యాఖ్యానించారు.
బెంగాల్‌కే ఎందుకు లక్ష్యం? అంటూ మమతా ప్రశ్నించింది. SIR ప్రక్రియలో బెంగాల్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ఆమె కోర్టు ముందు నిలదీశారు. ఎన్నికల ముందు రాజకీయ ఉద్దేశాలతో బెంగాల్‌పై దాడి జరుగుతోందని ఆమె ఆరోపించారు.
మైక్రో ఆబ్జర్వర్లు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు), అసిస్టెంట్ EROల పాత్రను పక్కన పెట్టారని మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3,800 మంది మైక్రో ఆబ్జర్వర్లు పేర్ల తొలగింపులను సూచిస్తున్నారని ఆరోపించారు. మొదటి దశలోనే సుమారు 58 లక్షల మంది ఓటర్లను ‘మరణించినవారు’గా గుర్తించారని, అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని పేర్కొంటూ ఈ ప్రక్రియను మహిళా వ్యతిరేకంగా అభివర్ణించారు. ప్రభుత్వ డొమిసైల్ సర్టిఫికెట్లు, ఇతర అధికారిక పత్రాలను కూడా అంగీకరించడం లేదని ఆరోపించారు.
ఈ అంశంపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అవసరమైతే ప్రతి నోటీసు కూడా తప్పనిసరిగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అనుమతితోనే జారీ అయ్యేలా ఆదేశాలు ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు.
