జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన కమెడియన్ బాబీ (లక్ష్మీనారాయణ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను తీవ్రంగా విషాదంలో ముంచింది. జబర్దస్త్‌తో పాటు యాంకర్ సుమ నిర్వహించే పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని బాబీ మంచి పేరు సంపాదించారు.
ఆయన అకస్మిక మృతిపై జబర్దస్త్ కమెడియన్లు విచారం వ్యక్తం చేశారు. యాంకర్ సుమ కూడా బాబీ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి చివరి నివాళులు అర్పించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్–రైల్వే బ్రిడ్జిపై జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు సినిమా చూడడానికి రాజమండ్రికి ఒక బైక్‌పై వెళ్తుండగా, రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ మరో బైక్‌పై ఎదురుగా వస్తున్నారు.
రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో బాబీకి తీవ్ర తలగాయాలు అయ్యాయి. అధిక రక్తస్రావం కారణంగా ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
