ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏప్రిల్‌లో పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ, ఆ తర్వాత జగన్‌కు దూరంగా ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వస్తున్న జగన్‌ను అకస్మాత్తుగా కలిసి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా మారింది.
ధర్మాన సోదరులపై ఉన్న విభేదాల విషయంలో తాను మాట్లాడాలని కోరినట్లు సమాచారం. పార్టీ సీనియర్లపై బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో దువ్వాడకు జగన్ సూచనలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాడేపల్లికి వచ్చి కలవాలని కూడా జగన్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
మండలిలో తన వాణిని వినిపిస్తానని, త్వరలోనే మళ్లీ జగన్‌ను కలుస్తానని దువ్వాడ చెబుతున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని భావిస్తున్నారట.
2029 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడం మరింత చర్చకు దారి తీసింది. పార్టీతో ఉన్న విభేదాలు సర్దుబాటు అయితే సస్పెన్షన్ ఎత్తివేతకు అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. జగన్ తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
