కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన మద్దతుపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కష్టసమయంలో వైఎస్ జగన్ చూపిన మానవీయత, ఆప్యాయతలను గుర్తుచేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మా తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాటి నుండి ఆయనను ఎలాగైనా బ్రతికించుకోవాలని వైఎస్ జగన్ గారు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. మా తండ్రిగారి ఆరోగ్యంపై ఆయన నిరంతరం దృష్టి సారించారు. నిత్యం నాకు నేరుగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వాకాబు చేస్తూ, మా కుటుంబానికి ధైర్యాన్ని అందించేవారు అని గిరి పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి వైఎస్ జగన్ స్వయంగా నివాళులర్పించడమే కాకుండా, ఆయన పాడెను తన భుజాలపై మోయడం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని గిరి తెలిపారు. ఒక మహానాయకుడికి వైఎస్ జగన్ ఇచ్చిన ఈ అత్యున్నత గౌరవాన్ని, ప్రేమాభిమానాలను తమ కుటుంబం జన్మలో మరచిపోలేదని అన్నారు.
వైఎస్ జగన్ చూపిన ఈ అపారమైన అభిమానం, మానవత్వంతో తమ కుటుంబంలో ఆయన పట్ల గౌరవం నిరంతరం పెరుగుతూనే ఉంటుందని ముద్రగడ గిరి స్పష్టం చేశారు. తమ కుటుంబానికి కష్టకాలంలో కొండంత అండగా నిలిచిన వైఎస్ జగన్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
