- Advertisement -

కొడుకును హత్య చేయించిన సవతి తల్లి!

- Advertisement -

వావివరసలను పూర్తిగా మరచి కొనసాగిన ఓ అక్ర‌మ‌ బంధం చివరికి అత్యంత దారుణమైన హత్యకు దారితీసింది. తనతో తెగతెంపులు చేసుకొని వేరే వివాహం చేసుకుని వెళ్లిపోతాడనే కక్షతో, స్వయంగా సవతి తల్లే సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి కొడుకును కడతేర్చిన దిగ్భ్రాంతికర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల మీడియాకు వెల్లడించారు.

నిర్మల్‌కు చెందిన ఆటో డ్రైవర్ అస్లాంఖాన్‌ (28) తండ్రి 17 ఏళ్ల క్రితం అన్వరీబేగం (41)ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే కొంతకాలంగా అస్లాంఖాన్, సవతి తల్లి అన్వరీబేగం మధ్య రహస్యంగా చనువు ఏర్పడింది. కాలక్రమేణా ఈ అనైతిక సంబంధానికి స్వస్తిపలికి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అస్లాంఖాన్‌ నిర్ణయించుకున్నాడు.

పెళ్లి చేసుకోవద్దని, అవసరమైన ఆర్థిక సహాయం తానే చేస్తానని అన్వరీబేగం అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా అస్లాం వెనక్కి తగ్గకపోవడంతో ఆమె అతడిని హతమారుస్తానని హెచ్చరించింది. ప్రాణభయంతో అస్లాం ఈ విషయాన్ని తన బాబాయ్‌కి చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువులకు ఈ బండారం తెలిసి పెద్దఎత్తున వివాదాలు చెలరేగాయి.

దీంతో అస్లాంఖాన్‌ నిర్మల్‌లోని వైఎస్సార్‌ కాలనీలో ఉన్న తన బాబాయ్‌ ఇంటికి మకాం మార్చి ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. తన రహస్య బంధం బయటపడి పరువు పోయిందనే తీవ్ర ఆగ్రహం, అస్లాం వేరే పెళ్లి చేసుకుని శాశ్వతంగా దూరమవుతాడనే కక్షతో అన్వరీబేగం అతన్ని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ఈ కిరాతక హత్య కోసం మహారాష్ట్రకు చెందిన ముఖీద్‌తో రూ.6 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని, రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అంతేకాకుండా తన సొంత తమ్ముడు షేక్‌ మహ్మద్‌కు కూడా డబ్బు ఆశ చూపి ఈ దారుణ కుట్రలో భాగస్వామిని చేసింది. అస్లాం ఫొటోలు, ఆటో నంబరుతో పాటు అతని కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ సుపారీ గ్యాంగ్‌కు చేరవేసేది.

ప్లాన్ ప్రకారం జులై 15న ఉదయం వైఎస్సార్‌ కాలనీ వద్ద అస్లాం ఆటోలో ప్రయాణికులతో వెళ్తుండగా.. ముఖీద్‌తో పాటు అఫ్రోజ్, సాయినాథ్‌ పవార్, షేక్‌ షాహిద్‌ ఎలియాస్‌ సల్మాన్‌లు కారులో వచ్చి అడ్డుకున్నారు. ఆటోలో నుంచి అస్లాంను బలవంతంగా బయటకు లాగి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అస్లాంఖాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు.

ఈ హత్యపై ఎస్పీ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తీవ్రంగా గాలించాయి. ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారుడైన అన్వరీబేగంను ఈ నెల 17న అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్‌ పవార్, షేక్‌ షాహిద్, షేక్‌ మహ్మద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -