నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యం, దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు.
తాను నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, విద్యా సంస్కరణల కోసం పనిచేశానని, యువత ఆశయాలకు ప్రాధాన్యమివ్వడమే తన నైతిక బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. 2026 మే 3న జరిగిన NEET-UG పరీక్ష అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు జూన్ 21న పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు. మొదటి రోజు నుంచే ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత తీసుకున్నానని, ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకుండా చూశానని తెలిపారు.
జూలై 16న వెలువడిన ఫలితాలు సంతృప్తికరంగా వచ్చి, పేద విద్యార్థులు కూడా విజయం సాధించినప్పటికీ, కొంతమంది బాధ్యతాయుత స్థానాల్లో ఉండి విద్యార్థులను తప్పుదోవ పట్టించడం తన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు.
గత పది రోజులుగా జంతర్ మంతర్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను దేశవ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వాడుకోకూడదు. దేశ ఐక్యత దెబ్బతినకుండా, విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉండేందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని స్పష్టం చేశారు. దేశసేవే తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యమని, ప్రధాని మోదీ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
