ఢిల్లీ పర్యటన అనంతరం లడ్డూ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం మారిందా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. గత కొన్ని వారాలుగా లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు కనిపించిన టీడీపీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది.
ఈ నెల 10న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులతో చంద్రబాబు సమావేశమైనట్లు సమాచారం. ముఖ్యంగా అమిత్ షాతో సుమారు గంటపాటు జరిగిన భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు లడ్డూ వివాదం కూడా చర్చకు వచ్చినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. లడ్డూ అంశాన్ని అతిగా రాజకీయీకరించడం సమంజసం కాదని, న్యాయపరమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర నాయకత్వం సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సీబీఐ సిట్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కూడా చర్చనీయాంశమైందని సమాచారం. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం అవసరమని, లేదంటే అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సూచనలు వచ్చినట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో లడ్డూ అంశాన్ని అధికారిక వేదికలపై తగ్గించి, ఇతర మార్గాల్లోనే కొనసాగించే వ్యూహం పార్టీ ఆలోచనలో ఉందని టిడిపి వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజకీయంగా సున్నితమైన ఈ వ్యవహారం భవిష్యత్‌లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
