గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసిన దారుణ ఘటనపై రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. ఈ ఘోరానికి ముమ్మాటికీ స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ అండతోనే నిందితులు ఇంతటి దుశ్చర్యకు ఒడిగట్టారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను అంబటి రాంబాబు మీడియా వేదికగా వివరించారు. బాధితురాలి ఇంటి వద్ద ఉన్న బోరు బావిని వినియోగించుకోవడానికి టీడీపీ నాయకుడు మూర్తి లంచం డిమాండ్ చేశారని తెలిపారు. అందుకు సదరు బాధిత కుటుంబం నిరాకరించడంతో వారి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ విషయమై బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
అయితే స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి జోక్యం చేసుకుని, ఆ కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నారని అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు.ఎమ్మెల్యే అండ చూసుకునే నిందితుడు మూర్తి మరింత రెచ్చిపోయాడని, పోలీసుల నుండి ఎటువంటి చర్యలు లేకపోవడంతో మరోసారి సదరు మహిళపై దాడికి తెగబడ్డాడని మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఒక హిజ్రాతో కలిసి బాధితురాలిని వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులు మొదట ఫిర్యాదు చేసినప్పుడే ఎమ్మెల్యే గళ్లా మాధవి నిష్పక్షపాతంగా స్పందించి ఉంటే, బాధితుల పక్షాన నిలబడి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఘోరం జరిగేదా?” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైకాపా నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం, సొంత పార్టీ నేతల అరాచకాలను కప్పిపుచ్చడమే పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగకుండా నిందితులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
