బెంగళూరు ఇంజినీరింగ్ విద్యార్థి ఖాతా ద్వారా రూ.7 కోట్ల సైబర్ మోసం వెలుగుచూసింది. స్నేహితుడిని నమ్మి ఇబ్బందుల్లో పడ్డారు ఇంజనీరింగ్ విద్యార్థి. హితుడికి సహాయం చేస్తున్నానని భావించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్థి, చివరికి రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు.
బెంగళూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి, ‘ఆయుష్’ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహంగా ఉన్నాడు. 2025 నవంబర్‌లో ఆయుష్ తన బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడంతో ఖాతా బ్లాక్ అయ్యిందని చెప్పి, తాత్కాలికంగా తన ఖాతాను ఉపయోగించుకోవాలని విద్యార్థిని కోరినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్నేహితుడిని నమ్మిన విద్యార్థి, తన కర్ణాటక గ్రామీణ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకున్నాడు. ఇందులో ఏటీఎంకు అనుసంధానమైన ఎయిర్టెల్ సిమ్ కార్డ్,నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ,పాస్‌వర్డ్..ఈ వివరాలను పోస్టు ద్వారా పంపినట్లు సమాచారం. తరువాత ఆయుష్ వాటిని అందుకున్నానని వాట్సాప్ సందేశాల ద్వారా ధృవీకరించాడు.
కొన్ని నెలల తరువాత విద్యార్థిని బ్యాంకు అధికారులు సంప్రదించి, అతని ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తెలియజేశారు.పోలీసుల సమాచారం ప్రకారం, ఆ ఖాతా ద్వారా సుమారు రూ.7 కోట్లు సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి.దీంతో బ్యాంకు ఖాతాను వెంటనే బ్లాక్ చేశారు.
తన ఖాతాను సైబర్ నేరాలకు ఉపయోగించారని గ్రహించిన విద్యార్థి, పోలీసులను ఆశ్రయించాడు.ఉత్తర విభాగ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆయుష్ మరియు మరికొంతమంది పేర్లపై మోసం కేసు నమోదు చేశారు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
