మద్యం తాగవద్దని హితవు పలికినందుకు కన్నతల్లిని, అమ్మమ్మను కడతేర్చిన దారుణ ఘటన బెంగళూరులోని కెంగేరి పరిధిలో వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న కుమార్తె, మనవడు కలిసి వృద్ధురాలిని కర్రతో కొట్టి హత్య చేశారు.
హసన్ జిల్లాకు చెందిన 75 ఏళ్ల జయమ్మ తన కుమార్తె భాగ్యలక్ష్మి (49), మనవడు కుశాల్ (26) వద్ద నివసించేందుకు బెంగళూరులోని కెంగేరి, సుభాష్ నగర్‌లోని మోనిషా అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. భాగ్యలక్ష్మి, కుశాల్ ఇద్దరూ తీవ్ర మద్యపానానికి బానిసలుగా మారారు. ఇంట్లోనే మద్యం తాగి తరచూ గొడవలు పడుతుండటంతో, వారిని జయమ్మ పలుమార్లు మందలించేది. దీనిపై అపార్ట్మెంట్ వాసులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. కొద్ది రోజుల క్రితం కుశాల్‌ను కుటుంబ సభ్యులు బలవంతంగా పునరావాస కేంద్రానికి పంపించినా, తిరిగి రాగానే మళ్లీ పాత అలవాటు కొనసాగించాడు.
జూన్ 21న రాత్రి కూడా తల్లి, కుమారుడు మద్యం సేవించి గొడవ పడుతుండగా, జయమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి లోనైన భాగ్యలక్ష్మి, కుశాల్ వంటగదిలో ఉపయోగించే రోకలి బండతో, క్రికెట్ బ్యాట్‌తో జయమ్మపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది.
హత్య తర్వాత నిందితులు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. మరుసటి రోజు కుశాల్ తన స్నేహితుడికి ఫోన్ చేసి, తన అమ్మమ్మ చనిపోయిందని, తాను తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నానని చెబుతూ, మద్యం తీసుకుని ఇంటికి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లిన స్నేహితుడు, జయమ్మ మృతదేహంపై గాయాలను గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న కెంగేరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మద్యం మత్తులో ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించి, కోలుకున్నాక అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అనితా బి.హద్దణ్ణనవర్ వెల్లడించారు.
