తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయన కోరారు.
వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని వైయస్ జగన్ సూచించారు.
మరోవైపు రాజమహేంద్రవరంలో కల్తీ పాల బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ భరోసానిచ్చింది. బొల్లినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను ఆరా తీశారు జక్కంపూడి విజయలక్ష్మీ , మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందినా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
