మాజీ మంత్రి, వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తోంది.
ఆయనకు స్వల్ప అస్వస్థత అనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ వార్త వెలువడడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. తాజా ఆరోగ్య బులెటిన్‌ను వైద్యులు త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
