- Advertisement -

విషాదం.. తండ్రి చనిపోయాడని కొడుకు.. కొడుకు లేడనే బాధతో తల్లి ఆత్మహత్య!

- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని లష్కర్‌గూడలో అత్యంత వేదనాభరితమైన ఘోర ఉదంతం వెలుగుచూసింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇరవై ఏళ్ల కొడుకు బలవన్మరణానికి పాల్పడగా.. కంటిముందే కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక ఆ కన్నతల్లి కూడా అదే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఇద్దరూ శవాలుగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పూసల కళాధర్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం భార్య కళావతి (45), కొడుకు శివకుమార్ (20)తో కలిసి పటాన్‌చెరుకు వలస వచ్చారు. అక్కడ పురోహితం చేస్తూ జీవనం సాగిస్తున్న కళాధర్ ఆరు నెలల క్రితం అకస్మాత్తుగా మరణించారు. తండ్రి మరణాన్ని శివకుమార్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. “నాన్న మరణించి 6 నెలలు గడిచినా నేను జీర్ణించుకోలేకపోతున్నాను” అంటూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. కొడుకు మానసిక పరిస్థితిని గమనించిన తల్లి కళావతి.. అతనికి కాస్త మార్పు వస్తుందనే ఆశతో ఐదు నెలల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలోని కనకదుర్గ కాలనీకి నివాసాన్ని మార్చింది.

అయినప్పటికీ శివకుమార్ నాన్న జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయాడు. మంగళవారం రాత్రి తన గదిలోకి వెళ్లిన అతను ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సమయం తర్వాత గదిలోకి వచ్చిన తల్లి కళావతి.. ఉరికి వేలాడుతున్న కొడుకును చూసి గుండె పగిలేలా రోదించింది. భర్త, కొడుకు ఇద్దరూ లేని జీవితం తనకెందుకు అని భావించిన ఆమె.. కొడుకు మృతదేహాన్ని కిందకు దించి, అదే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. బుధవారం ఉదయం శివకుమార్ ఎంతకూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చి చూశాడు. కిటికీలోంచి తల్లి, కొడుకుల మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివకుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -