ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్ …ప్రస్తుతం యూఏఈ (UAE)లో కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ దుబాయ్‌కి మారారని అక్కడ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక క్రికెట్ అవకాశాల కోసం చూస్తున్నారని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ముందుగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రస్తుతం నిర్వహిస్తున్న ఒక టోర్నమెంట్ కోసం స్థానిక జట్టులో భరత్‌ను చేర్చుకున్నారు. ఈ పోటీలు శుక్రవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ ఓవల్ 1లో ప్రారంభమవగా భరత్‌ను ‘టీమ్ స్టాలియన్స్’ జట్టులోకి తీసుకున్నారు.
ఈ ఏడు మ్యాచ్‌ల… రెండు రోజుల వైట్-బాల్ టోర్నమెంట్‌లో పోటీపడుతున్న నాలుగు జట్లలో టీమ్ స్టాలియన్స్ ఒకటి. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలను మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీని రూపొందించినట్లు ఈసీబీ తెలిపింది. ఇందులో పాల్గొంటున్న మిగతా జట్లు — టీమ్ ఫాల్కన్స్, టీమ్ లెపర్డ్స్ మరియు టీమ్ ఈగిల్స్.
నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో జరగనున్న యూఏఈ ఫ్రాంచైజీ లీగ్ ‘ఐఎల్ టీ20’ (ILT20)లో ఆయన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్లేయర్స్ వేలం అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన వేలంలో పేరు నమోదు చేసుకోవడానికి తగినంత సమయం ఉంది.
వివిధ దేశాలకు చెందిన పలువురు అంతర్జాతీయ క్రికెటర్ల మాదిరిగానే ఆయన కూడా దుబాయ్‌కి మారారు. ఇక్కడ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక అవకాశాలను పరిశీలిస్తున్నారు అని ఎమిరేట్స్ క్రికెట్ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్…భారతదేశం తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆయన ఈ నెల ప్రారంభంలో అంతర్జాతీయ, దేశీవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
