రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఘోర మారణహోమం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనపై పోక్సో కేసు నమోదు చేసిన కక్షతో ఒక దుర్మార్గుడు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు.
నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ మారణహోమానికి ఒడిగట్టాడు. పక్కా ప్రణాళికతో వేర్వేరు ప్రాంతాల్లో తన లక్ష్యాలను హతమార్చాడు. ఒకచోట ముగ్గురిని, మరోచోట ముగ్గురిని చంపినట్లు నిందితుడు స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. “నేను ఆరుగురిని చంపేశాను, కొద్దిసేపట్లో నేను కూడా చనిపోతున్నాను” అని అతను హెచ్చరించాడు. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకునేలోపే, నిందితుడు ప్రాణాలు తీసుకున్నాడా లేదా పరారిలో ఉన్నాడా తెలియాల్సి ఉంది.
ఈ దారుణ ఘటనలో చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మీ (45), 17 ఏళ్ల మైనర్ బాలిక, నిందితుడి భార్య పార్వతి సరిత (30), వారి పిల్లలు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2) మృతి చెందారు. వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటన గురించి తెలియగానే సైబరాబాద్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతం భారీ బందోబస్తుతో షాబాద్‌కు చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పాత కక్షలు లేదా కుటుంబ కలహాల కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. షాబాద్‌లో రాజ్ కుమార్రాత్రి 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు హత్యాకాండ కొనసాగించాడని పోలీసులు వెల్లడించారు. ‘బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, అమ్మమ్మను హత్య చేశాడు. బాలికను 3KM దూరం తీసుకెళ్లి చంపేశాడు. రేప్ జరిగిందనే దానిపై ఆధారాలు లేవు. ఆ తర్వాత సొంతింటికి వచ్చి భార్య సరిత, ఇద్దరు చిన్నారులను చంపేశాడు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు పరారీలో ఉన్నాడు.’ అని తెలిపారు.
ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో షాబాద్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు మోహరింపు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు.
