కోరుట్ల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య రోకలిబండతో మోది హత్య చేసింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఇప్ప కాశీరాం (35), రజినీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు కలిసి మద్యం తాగగా, ఆ సమయంలో రజినీ కూడా మద్యం తాగడంపై కాశీరాం మనసులో ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు 20 రోజుల క్రితం తారాస్థాయికి చేరగా, స్థానికులు జోక్యం చేసుకుని గొడవను ఆపారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.
బుధవారం కుటుంబ సభ్యులందరూ కలిసి వనభోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రజినీ తన ముగ్గురు పిల్లలను తన తల్లిగారింటికి పంపించేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీరాంపై రజినీ రోకలిబండతో తలపై బలంగా దాడి చేసింది. తీవ్ర గాయాలవ్వడంతో కాశీరాం అక్కడికక్కడే మరణించాడు. అనంతరం రజినీ తన తల్లిగారింటికి వెళ్లిపోయింది.
సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. గురువారం నిందితురాలు రజినీని పోలీసులు అరెస్టు చేశారు. మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు పర్యవేక్షణలో సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై చిరంజీవి దర్యాప్తు నిర్వహించారు. కాశీరాం బంధువుల ఫిర్యాదు మేరకు నిందితురాలిని రిమాండ్కు తరలించారు.
తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లడంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. మద్యం వేధింపుల నేపథ్యంలో జరిగిన ఈ హత్య కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది.
