- Advertisement -

సాయం చేయడానికి వెళ్తే.. ఎడారిలో పూడ్చిపెట్టారు!

- Advertisement -

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు విదేశాల్లో సాయం చేయడానికి వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. ప్రాణం తీసిన ఘటనపై కేసు భయంతో నిందితులు మృతదేహాన్ని ఎడారిలో పూడ్చిపెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం కువైట్‌లోని అల్ సల్మిలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి తండాకు చెందిన కైలాష్ (29) కువైట్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన తండ్రీకొడుకులతో కైలాష్‌కు పరిచయం ఉంది. ఈ ఏడాది మార్చి 19న వారు పనిచేస్తున్న చోట పొక్లెయిన్ మెషిన్ చెడిపోవడంతో, దాన్ని బాగు చేయమని కైలాష్‌ను పిలిచారు. రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కైలాష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

తమ కారణంగానే కైలాష్ మరణించాడని, పోలీసులకు దొరికితే జైలు పాలవుతామనే భయంతో ఆ తండ్రీకొడుకులు దారుణానికి ఒడిగట్టారు. మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో పూడ్చిపెట్టారు. అప్పటి నుండి కైలాష్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కువైట్‌లో అప్పట్లో ఉన్న పరిస్థితుల వల్ల దర్యాప్తులో జాప్యం జరిగింది.

ఘటన స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోవడంతో అసలు నిజం బయటపడింది. మృతుడి కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిచ్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కైలాష్ తండ్రి గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల్లో గణేశ్ పరారీలో ఉన్నాడని ఎస్సై ఆరీఫ్ తెలిపారు.

కువైట్ నుండి మృతదేహాన్ని రప్పించి తమకు అప్పగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సొంతూరి నుంచి వెళ్లిన యువకుడు ఇలా విదేశాల్లో దారుణంగా హత్యకు గురికావడంతో కొరట్‌పల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -