- Advertisement -

మియాపూర్‌లో భర్త హత్య కేసు.. దర్యాప్తులో సంచ‌ల‌న‌ విషయాలు

- Advertisement -

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన పెంటేశ్ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ‘దృశ్యం’ సినిమా తరహాలో మృతదేహాన్ని మాయం చేసిన భార్య సత్యవతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మియాపూర్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మల్లాని పెంటేశ్ (57), సత్యవతి (47) దంపతులు. సత్యవతి అదే అపార్టుమెంటులో నివసించే మర్రి మధుసూదన్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న పెంటేశ్ భార్యను నిలదీస్తూ వేధించేవాడు. భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండవచ్చని భావించిన సత్యవతి, మధుసూదన్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ క్రమంలోనే వారు ‘దృశ్యం’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని, మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఇతర రాష్ట్రాల్లో దహనం చేయాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం గతేడాది నవంబరు 19న రాత్రి సత్యవతి, తన ప్రియుడు మధుసూదన్, అతడి స్నేహితుడు రాజేశ్ కుమార్‌తో కలిసి భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెంటేశ్‌కు ఇచ్చారు. అతను స్పృహ కోల్పోయాక, ముగ్గురు కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని వాహనంలో మహారాష్ట్రకు తరలించి, నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోలు పోసి తగలబెట్టారు.

హత్య తర్వాత ఎవరూ పసిగట్టకుండా నవంబరు 25న పెంటేశ్ అదృశ్యమయ్యాడంటూ సత్యవతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనితో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.

ఈ కేసుకు సంబంధించి సత్యవతి, మధుసూదన్‌రెడ్డితో పాటు సహకరించిన రాజేశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ రితిరాజ్ బుధవారం వెల్లడించారు. సినిమా తరహాలో ప్లాన్ చేసినప్పటికీ.. పోలీసుల సాంకేతిక విచారణలో నిందితుల బండారం బయటపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -