షుగర్ బాధితులకు కీలక సమాచారం. మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. చాలా మంది మధుమేహ రోగులు ప్రస్తుతం ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అధిక ధర కారణంగా కొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కొత్తగా ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. వారానికి ఒక సారి తీసుకుంటే చాలు.. ధరలు సైతం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు.
మధుమేహం చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్ ‘అవిక్లీ (Awiqli)’ పేరుతో ఈ ఇన్సులిన్‌ను విడుదల చేసింది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఇది ఉపయోగపడనుంది. సాధారణంగా ఇన్సులిన్ తీసుకునే రోగులు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొత్తగా వచ్చిన ‘అవిక్లీ’తో వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఏడాదికి 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52 వేసుకుంటే చాలు. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రస్తుతం దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
అదే విధంగా మరో 13.6 కోట్ల మందిలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయి. అలాగే తొమ్మిది లక్షల మందికిపైగా టైప్-1 మధుమేహ రోగులు ఉన్నారు. టైప్-2 మధుమేహంతో బాధపడే వారిలో కూడా కొంతమందికి ఇన్సులిన్ తప్పనిసరిగా అవసరం అవుతోంది. ఇలాంటి వారి కోసం ఇప్పుడు ఈ ఇన్సులిన్‌ను ఫ్లెక్స్‌టచ్ పెన్ ద్వారా వారానికి ఒక్కసారి తీసుకోవాలి. ఇలా తక్కువసార్లు ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడంతో చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యంలో ఇది రోజూ తీసుకునే ఇన్సులిన్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు క్లినికల్ పరీక్షల్లో తేలిందని కంపెనీ వెల్లడించింది. ఈ తాజా ఇంజెక్షన్ తో మధుమేహ నియంత్రణ మరింత సులభంగా భావిస్తున్నారు.
