ఖమ్మం జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన మూతినెలలకే భార్య పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతికి భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్ (27), తన తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతితో అతనికి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన మూడో రోజు నుంచే ఆ భార్య తన భర్తను టార్గెట్ చేస్తూ.. ‘‘నీకు మగతనం లేదు’’ అంటూ తీవ్రస్థాయిలో వేధించడం ప్రారంభించింది.
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా సదర్ లాల్ తన అత్తగారింటికి వెళ్లగా, అక్కడ భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరి ముందు అతన్ని తీవ్రంగా అవమానించారు. ఈ నిందలను, అవమానాన్ని తట్టుకోలేక సదర్ లాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన అతను, మార్గమధ్యలో బావకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి తన లైవ్ లొకేషన్ పంపాడు.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వీ. వెంకటాయపాలెం కాలువ దగ్గరికి వెళ్లి వెతకగా.. అక్కడ సదర్ లాల్ బైక్, మొబైల్ ఫోన్, కలుపు మందు డబ్బా లభించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు కాలువలో గాలింపు చర్యలు చేపట్టి సదర్ లాల్ మృతదేహాన్ని వెలికితీశారు.
అయితే, ఈ ఘటనపై సదర్ లాల్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లికి ముందే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయిన తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించేందుకే కావాలనే సదర్ లాల్‌పై నిందలు మోపారని తెలిపారు. భర్తపై అబద్ధపు ప్రచారం చేస్తూ మానసికంగా కృంగదీశారని, అవసరమైతే తాము మెడికల్ టెస్టులు కూడా చేయించామని వారు కన్నీటిపర్యమయ్యారు. భార్య వేధింపులే తన కుమారుడి ప్రాణాలు తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
