హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తోటి మహిళా అధికారిపై లైంగిక దాడి, వేధింపుల కేసు నమోదు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సోమవారం రోజంతా జోరుగా ప్రచారం జరిగింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అదంతా కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకమని తేలడం గమసార్హం.
మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు ఉదయ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఉలిక్కిపడిన ఉదయ్.. ఆదివారం అమీర్‌పేట్‌లోని తన స్నేహితురాలి గదికి వెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా విపరీతంగా మద్యం సేవించడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం అతను ఎంతకూ మేల్కోకపోవడంతో, మంచం పక్కనే ఉన్న మద్యం సీసా, శానిటైజర్‌ను చూసి ఆత్మహత్యకు యత్నించినట్లు భావించిన సోదరుడు, మిత్రులు ఉదయం 9.30 గంటలకు ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు నిర్వహించిన రక్త పరీక్షల్లో ఎలాంటి విషపదార్థం లేదని తేలడంతో, కేసును పక్కదారి పట్టించేందుకే ఉదయ్ ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మద్యం మత్తులోనే ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు భావిస్తున్నారు. మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆమెతో ఉన్న సాక్ష్యాలన్నీ తన ఫోన్‌లో ఉన్నాయని ఉదయ్ ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ పోలీసు అకాడమీ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ పుటేజీని సేకరిస్తున్న పోలీసులు, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
