ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్స మావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ గైర్హాజరయ్యారు. సీఎం నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కీలక ప్రతిపాదనలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తుండగా.. డిప్యూటీ సీఎం హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతిలో ఉన్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. దీనివల్లే ఆయన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి రాలేకపోయారని సమాచారం.
పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో, ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించి ఓదార్చారు. ఆ తర్వాత నుంచి ఆయన మంగళగిరిలోనే ఉంటూ విశ్రాంతి పొందుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తి కోలుకుని, మళ్లీ తన అధికారిక సమీక్షలు, పర్యటనలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
